Tuesday, 3 November 2026

తాగుడు వద్దన్నందుకు ఉరేసుకుని ఆత్మహత్య

హైదరాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి )  : మద్యం తాగవద్దని తండ్రి, సోదరుడు మందలించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌/-కు చెందిన సోమనాథ్‌ ఘోష్‌ (24)నగరానికి వలస వచ్చి రాయదుర్గం డైమండ్‌ హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మాదాపూర్‌లోని ఓ క్యాంటీన్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. కాగా.. సోమనాథ్‌ గతంలో బాగా మద్యం సేవించేవాడు. అయితే కొన్ని రోజులు బంద్‌ చేసి.. రెండు రోజుల క్రితం మళ్లీ మొదలు పెట్టాడు. గమనించిన తండ్రి, సోదరుడు అతన్ని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన సోమనాథ్‌ తన గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ప్లాస్టిక్‌ తాడుతో ఉరి వేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. డ్యూటీ నుంచి వచ్చిన అతని రూమ్‌మెట్స్‌ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.