. తాలిబాన్లపై పాక్, ఆఫ్గనిస్థాన్‌ల ఉమ్మడిపోరు ఉగ్రవాద నిర్మూలనకు జాతీయ ప్రణాళిక పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పెషావర్,ఇస్లామాబాద్,కాబూల్,డిసెంబర్17(జనంసాక్షి): పెషావర్‌లోని సైనిక పాఠశాలలో తాలిబన్‌లు సృష్టించిన నరమేధం దృష్ట్యా ఉగ్రవాదులపై మరిన్ని దాడులు జరపాలని పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం రాత్రి అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో చర్చించారు. తీవ్రవాదులపై దాడులు చేయాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. మరోవైపు పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు వారం రోజుల్లో జాతీయ ప్రణాళికను తీసుకొస్తున్నట్లు ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం ప్రకటించారు. సైనిక పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకుందని షరీఫ్ చెప్పారు.
‘ఉగ్రవాదాన్ని కేవలం పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి మాత్రమే కాకుండా మొత్తం ఈ ప్రాంతం నుంచి అంతమొందించాలి.” అని చెప్పారు. కాగా పాకిస్థాన్ సైనికప్రధానాధికారి రషీల్ షరీఫ్ బుధవారం కాబూల్ వెళ్లారు. పెషావర్ దాడికి పాల్పడింది తామేనంటూ తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ సంస్థ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆ సంస్థ నేత, అఫ్ఘాన్ సరిహద్దులో ఉంటున్న ముల్లా ఫజుల్లా అప్పగింత, ఆసంస్థపైన తీసుకోవలసిన చర్యలపై అఫ్ఘానిస్థాన్ అధికారులతో రషీల్ షరీఫ్ చర్చిస్తారు. పాఠశాలపై దాడిని ఖండించిన అఫ్ఘానిస్థాన్ తాలిబన్లు పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేయడాన్ని అఫ్ఘానిస్థాన్‌కు చెందిన తాలిబన్లు ఖండించారు. అమాయక విద్యార్థులను చంపడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఈమేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు బుధవారం దేశ వ్యాప్తంగా పాఠశాలలు పెషావర్ మృతులకు సంతాపం తెలిపాయి. విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కొన్ని పాఠశాలలు ప్రత్యేక ప్రార్థనలు జరిపాయి.
. తాలిబాన్లపై పాక్, ఆఫ్గనిస్థాన్‌ల ఉమ్మడిపోరు




