తుంగభద్ర నికర జలాల హక్కును కాలరాస్తున్నారు: అవినాశ్
కడప,మే7(జనం సాక్షి): కృష్ణా నది వరద జలాలను నమ్ముకుని తుంగభద్ర నికర జలాల హక్కును కాలరాస్తున్నారని కడప జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అవినాష్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాం నుంచి నికర జలాలను తరలిస్తే పులివెందుల బ్రాంచ్ కెనాల్, లింగాల కుడి కాల్వకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. తుంగభద్ర నుంచే పులివెందుల, ధర్మవరం వంటి పట్టణాలకు 2 టీఎంసీల తాగునీరు ఇవ్వాలి. అవి పోను సాగు నీటికి ఏమి మిగలదన్నారు. తుంగభద్ర నికర జలాల హక్కులను ఎలా వదులుకోమంటారని ప్రశ్నించారు. చిత్రావతి కింద దుస్థితి చేసే దివంగత నేత వైఎస్సార్ ఆ ప్రాజెక్టును పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. మా నికర జలాలను కొల్లగొట్టే ప్రయత్నాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెస్‌ని మూడో శత్రువుగా భావిస్తున్నామన్నారు. మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా.. టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. టీడీపీ అవిర్భావం నుంచి కూడా పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తుందని గుర్తుచేశారు. టీడీపీని కూడా చంద్రబాబు సర్వనాశనం చేశారని అన్నారు. ప్రత్యేక ¬దా పేరిట ధర్మ పోరాట మంటూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.