Monday, 2 November 2026

తుంగభద్ర పనులను ఆపండి

కేంద్రానికి ఎస్‌కె జోషి లేఖ

హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): తుంగభద్ర నీటి వివాదంపై కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి లేఖ రాశారు. ఏపీ నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు వివరాలను, అభ్యంతరాలను జోషి లేఖలో పేర్కొన్నారు. వెంటనే ప్రాజెక్టు పనులు ఆపాలని.. డీపీఆర్‌ను తమకు పంపించే ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర కార్యదర్శి యూపీ సింగ్‌ను లేఖలో కోరారు. 40 టీఎంసీల తుంగభద్ర జలాలను అనంతపురానికి తరలించే ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. విభజన తర్వాత జారీ చేసిన జీవో కాబట్టి విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, తెలంగాణ ప్రభుత్వానికి పంపించాలి. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిశీలన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌కు నివేదించాలి. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తర్వాతనే ప్రాజెక్టు పనులు సాగించాలి. ఏపీ ప్రభుత్వం ఇవేవిూ చర్యలు చేపట్టకుండా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇదే విషయమై మంత్రి హరీష్‌ రావు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసారు. అనుమతులు లేకుండా జీవో జారీ చేసిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చారు. తోణ చర్యలు తీసుకుని ప్రాజెక్ట్‌ పనులు చేపట్టకుండా ఆపాలని అన్నారు.