– పొలానికి వెళ్తుండగా దాడిచేసి హతమార్చిన దుండగులు
– విచారణ చేపట్టిన పోలీసులు
వికారాబాద్, నవంబర్6(జనంసాక్షి) : వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్లో దారుణం జరిగింది. తెరాసనేత నారాయణరెడ్డి దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన నారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణరెడ్డి అనుచరులుగా ఉన్న కొందరు యువకులు ఈ మధ్యే కాంగ్రెస్లో చేరారు. అప్పట్నుంచీ వారితో నారాయణరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆ యువకులే ఆయన్ని హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఆగ్రహం చెందిన నారాయణరెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి గొడవలు జరుగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండాపరిస్థితిని చక్కదిద్దారు. పాత కక్షలే నారాయణరెడ్డి హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెరాస నేత దారుణ హత్య




