– తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉంది
– చంద్రబాబు అండగా తెలంగాణలో మళ్లీ చరిత్ర తిరగరాస్తాం
– సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
– మహిళలకు కేబినెట్లో స్థానం కల్పించని ఏకైక ప్రభుత్వం తెరాసదే
– పంచాయతీ ఎన్నికలకు తెదేపా సిద్ధంగా ఉంది
– తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ
– మహానాడులో టీతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ
హైదరాబాద్, మే24(జనం సాక్షి) : తెలంగాణలో తెరాస ప్రభుత్వంలో దోపిడీ పెరిగిపోయిందని, కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కవిూషన్లతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలుత ఎల్.రమణ తదితర తెదేపా నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మహాసభలో రమణ ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. తెదేపా పుట్టిన నాటి నుంచి బడుగుల అభివృద్దికి పెద్దపీట వేసిందన్నారు. తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే చూడలేకనే ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రమణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యకర్తల గౌరవం ఇముడింప చేసేలా పనిచేస్తాయని అయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో మినీ మహానాడు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. తెరాస ప్రభుత్వంలో ధన దోపిడి పెరిగిందని.. అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని, సామాజిక న్యాయం కొరవడిందని రమణ ఆరోపించారు. స్వార్థం కోసం కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని విమర్శించారు. చంద్రబాబు అండతో మళ్లీ తెలంగాణలో చరిత్ర తిరగరాస్తామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీ టీడీపీనేనని వెల్లడించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ప్రజా ఆస్పత్రిగా మారుస్తామని ప్రకటించారు. తెరాస ప్రభుత్వం ఒకటి రెండు సామాజిక వర్గాలకే అధికారం పరిమితమైందన్నారు. మహిళలకు కేబినేట్లో స్థానం ఇవ్వని ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తెలంగాణ కార్యకర్తలే అండ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులు కిందిస్థాయిలోని కార్యకర్తలను నేతలుగా తయారు చేశారన్నారు. వారిలో బాగంగా పాలుపట్టుకొని బతికే మల్లారెడ్డిని ఎంపీగా చేస్తే తెదేపాను వీడి వెళ్లిపోయాడని అన్నారు. ఇలా తెదేపాతో రాజకీయ ఓనమాలు దిద్దిన నేతలంతా ఇప్పుడు ఆ పార్టీని తెలంగాణలో కష్టాల్లోకి వదిలి పోయారన్నారు. అయినా ఎక్కడ భయపడేది ఏదని, కార్యకర్తల అండతో మరోసారి తెదేపా సత్తాను చాటుతామని స్పష్టం చేశారు. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయనడానికి కర్ణాటకనే నిదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
మహానాడుకు నన్ను పిలువలేదు – మోత్కుపల్లి
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడుకు హాజరుకాకపోవడంపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం జరుగుతున్న టీటీడీపీ మహానాడులో మోత్కుపల్లితో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పాల్గొనలేదు. ఈ అంశంపై మోత్కుపల్లి విూడియాతో మాట్లాడుతూ.. ‘ టీటీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం అందలేదు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారనుకున్నా.. అది జరుగులేదు.. అందుకే దూరంగా ఉన్నాను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నా వ్యాఖ్యలు టీటీడీపీ తప్పుగా అర్ధం చేసుకుంది. అధినేత చంద్రబాబుకే వివరణ ఇస్తానని చెప్పా. ఆరోజు నుంచి ఇప్పటివరకు అపాయింట్మెంట్ కోరినా కలిసేందుకు అవకాశం దొరకటం లేదు’ అని వెల్లడించారు.
తెరాస ప్రభుత్వంలో దోపిడీ పెరిగింది




