Friday, 6 November 2026

తెరాస హయాంలోనే మైనార్టీలకు గుర్తింపు

– నాలుగేళ్లలో అన్నివిధాల అభివృద్ధి చేశాం

– కాంగ్రెస్‌, టీడీపీలు ముస్లీంలను ఓటుబ్యాంకుగానే చూస్తాయి

– మైనార్టీల సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : ముస్లీంల అభ్యున్నతికి నాలుగేళ్లలో అన్ని విధాల కృషిచేశామని, రాబోయే కాలంలో మైనార్టీల సోదరులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం నగరంలోని నాంపల్లిలో జరిగిన మైనార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఎలాంటి భయం లేకుండా అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు జీవిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు ముస్లింలను ఓటు వేసే యంత్రాలుగానే చూశాయని విమర్శలు గుప్పించారు. అన్ని మతాల్లోని పేదలకోసం సంక్షేమ పథకాల రూపకల్పన చేశామన్నారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తుచేశారు. పేద ముస్లిం యువతుల పెళ్లి కోసం షాదీముబారక్‌ అమలు చేస్తున్నామన్నారు. తెరాస ప్రభుత్వం ముస్లింల సమగ్రాభివృద్ధికి పాటుపడిందని, ముస్లింలకు బడ్జెట్‌లో రూ. 2 వేల కోట్లను కేటాయించడమే దీనికి నిదర్శమన్నారు. కాంగ్రెస్‌ తెదేపా పాలనలో పది గురుకులాలు ఉంటే కేసీఆర్‌ వచ్చిన తర్వాత 210 గురుకులాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ లౌకికవాదేనని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతస్తులు అన్న తేడా లేకుండా అన్నివర్గాలను కుటుంబ సభ్యుల్లా కేసీఆర్‌ ఆదుకున్నారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పేద ముస్లింలతో పాటు ఇతర బడుగు బలహీనవర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలుచేసే ఆలోచనలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందని తెలిపారు. నిరుపేద ముస్లిం యువతుల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం షాదీ ముబారక్‌ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. హైదరాబాదీలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారనీ, తమ ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. అందరిని కలుపుకుని వెళ్లినప్పుడే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ విశ్వసిస్తారనీ, గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం దాన్నే పాటిస్తున్నారని వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దళితులకన్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ముస్లింలు జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మైనార్టీలు గౌరవంగా బతుకుతున్నారని తెలిపారు. ముస్లింలలో అక్షరాస్యతను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. మైనార్టీల కోసం 200కు పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పేద ముస్లిం మైనార్టీ పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.