Thursday, 5 November 2026

తెలంగాణను పచ్చలహారంగా మారుద్దాం

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి

మంత్రి జోగు రామన్న పిలుపు

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడంతో ద్వారా తెలంగాణను పచ్చలహారంగా మార్చాలని అటవీశాఖ మంత్రి జోగురామన్నపిలుపునిచ్చారు. ఇదంతా మన పిల్లల భవిష్యత్‌ కోసమే అని గుర్తించాలని అన్నారు. త్వరలో ప్రాంభమయ్యే నాలుగో విడత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతారని అన్నారు. మొక్కుల నాటడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని, తద్వారా తెలంగాణను పచ్చగా పరిరక్షించుకోవాలని కోరారు. హరితహారంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం నర్సరీల్లో ఎన్ని మొక్కలున్నాయి? ఇంకెన్ని మొక్కలు అవసరం అన్న ప్రణాళికను తయారు చేస్తే మరిన్ని మొక్కలను కొనుగోలు చేస్తామని తెలిపారు. అడవులను పెంచేందుకు సీడ్‌ బాంబింగ్‌ ద్వారా ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ప్రతిశాఖ ద్వారా సీడ్‌బాళ్లను తయారు చేయించేందుకు ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలు.. పెరిగిన వాటి వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఇందులో భాగంగా నాటిన ప్రతి మొక్కకూ లెక్క ఉండాలని స్పష్టం చేశారు. నాటిన మొక్కలు ఏ స్థాయిలో ఉన్నాయి.. వాటి పెరుగుదల, సంరక్షణ వంటి వివరాలను అధికారులు ఎప్పుటికప్పుడు పరిశీలించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఖాళీ ప్రదేశాలు, చెరువులు, కుంటలు, కట్టలు, రోడ్లకు ఇరువైపులా, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు తదితర చోట్ల వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటినవాటి వివరాలు అంద జేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా నాటి సంరక్షించిన వాటి వివరాలు అందజేయాలన్నారు. నాలుగోవిడత హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రజలకు కోరుకున్న మొక్కలను అందజేయాలని సూచించారు. పచ్చదనం పెంపొందిం చడంలో సమష్టిగా కృషిచేయాల్సిన అవసరం ఉందని

వ్యాఖ్యానించారు. హరితహారంపై అలసత్వం వహించే అధికారులను ఇంటికి పంపిస్తామని మంత్రి జోగురామన్న హెచ్చరించారు. గ్రామ హరితరక్షణ కమిటీ సహకారంతో మొక్కల పెంపకాన్ని విస్తృతం చేయాలని పేర్కొన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడంలో అధికారులు,ప్రజలు ముందుకు రావాలన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నాటిన మొక్కలు ఎంత వరకు బతికి ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరించి పెట్టుకోవాలన్నారు. ప్రతి శాఖ ద్వారా నాటిన మొక్కల ప్రదేశాలకు అధికారులు వెళ్లి పరిశీలించి నివేదికను తయారు చేసి వెంట తీసుకురావాలని సూచించారు. గత ఏడాది నాటిన మొక్కల వివరాలు, ఎంత వరకు నాటుకున్నాయనే సమాచారం లేక పోవడంతో ముందుకు వెళ్లలేమని అన్నారు. ఎన్ని మొక్కలు నాటుతారో ఆ స్థలాల ఎంపికను చేసి యాక్షన్‌ ప్లాన్‌ను రెడీ చేసి ఇవ్వాలన్నారు.