– ప్రాజెక్టులు ఆపాలని బాబు లేఖలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
– టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
– కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలే
– బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు
హైదరాబాద్, నవంబర్23(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ వ్యతిరేకులకు కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా మారడంతో రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం పట్టిందని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ తోక పార్టీ అని, చంద్రబాబు ముక్త తెలంగాణ కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు అడ్డుకోవాలంటూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలో విస్తరణ కోసం తెలంగాణ ఎన్నికలు తమ పార్టీకి ప్రతిష్ఠాత్మకమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించిన
పార్టీ బీజేపీ అని అన్నారు. అందువల్ల రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. 2014లో టీడీపీతో పొత్తుపెట్టుకుని తాము తీవ్రంగా నష్టపోయామని గుర్తు చేసుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ మతంపై ఆధారపడ్డ పార్టీలు కాబట్టే మతపరమైన రిజర్వేషన్లను ఆ పార్టీలు వ్యతిరేకించడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ చేసిన ఆరోపణలను మురళీధరరావు ఖండించారు. కేసీఆర్ పాలన నిజాం నవాబ్‌ను తలపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు తెలంగాణలో, బహిరంగ సభల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తెలంగాణలో మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటన చేస్తారని, జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణను బాబు చేతుల్లోకి వెళ్లనివ్వం




