కెసిఆర్ తీరుపై మండిపడ్డ తమ్మినేని
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్
హైదరాబాద్,నవంబర్26(జనం సాక్షి): సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను అరెస్ట్ చేయడం దారుణం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ
నడుస్తోందని అనిపిస్తుందన్నారు. మంగళవారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ఆందోళనలను అణచి వేయాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉండదన్నారు. కార్మికుల ఆశయాలను అణచివేయడం కేసీఆర్ తెలివి తక్కువతనం అని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విధుల్లోకి తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ తీరుపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణకు సీపీఎం కారణం అన్నట్లుగా కొన్ని సభల్లో మందకృష్ట చెబుతున్నారని ఆక్షేపించారు. ఆయన ఎవర్ని కాపాడాలని అలా చెప్తున్నాడో తెలియదని వ్యాఖ్యానించారు. ఆ రకమైన దుష్పచ్రారాన్ని మానుకోవాలని మందకృష్ణను తమ్మినేని కోరారు. మళ్లీ అలాంటి దుష్పచ్రారం చేస్తే తమ పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డగిస్తారని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో బీజేపీ అనేక ఉల్లంఘనలు చేస్తోందన్నారు. కేసీఆర్ కూడా బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఐఏఎస్ వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నాడని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు చేపడితే ఎవరైనా ప్రజా ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీపీఎం తరఫున ఆయన డిమాండ్ చేశారు.




