తెలంగాణలో జోడుగుర్రాలుగా అభివృద్ది,సంక్షేమం

నాలుగేళ్లలో నిరంతర శ్రమతోనే పథకాలకు రూపు

కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి

హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బహుశా దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. ఇవన్నీ కేవలం తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఈ నాలుగేళ్ల కాలంలోనే సాధ్యమయ్యాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ఇదేనని అన్నారు. వీటిని చిన్నవిగా చేసి కాంగ్రెస్‌,బిజెపిపుల రాజకీయ విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కేవలం అధికారమే పరమావధిగా అవి ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వారి పాలనలో ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేక పోయారో ప్రజల ముందు వివరించాలని అన్నారు. నాలుగేళ్ల కింద వ్యవసాయం అంటే గిట్టుబాటు కానిదిగా, దండగగా ఉండేనని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సిఎం కేసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడు రైతు పంట పెట్టుబడి కోసం ఎవరివైపు చూడకుండా ఉండేందుకు ఎకరానికి 4000 చొప్పున ఏటా 8000 రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇంత వరకు రైతుకు పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగానీ, నాయకులుగానీ లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పంట పెట్టుబడి పథకంవైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, వ్యవసాయానికి కనీసం రెండు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితిని మార్చి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారని, కోటి ఎకరాలను మాగాణాగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని అన్నారు. రైతులకే కాకుండా పేదింట్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని మొదట్లో 51వేల రూపాయలు ఇచ్చారని, అది సరిపోదని దానిని 75వేల రూపాయలకు పెంచారని, అదీ చాలడం లేదని ఇప్పుడు లక్షా 116 రూపాయలను ఇస్తున్నారన్నారు. పేదింట్లో ఆడపిల్ల గర్భం దాల్చితే ప్రసవం అయ్యే వరకు పని చేయాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్‌ ఇక అలాంటి పరిస్థితి ఉండొద్దని ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు కలిపి 13వేల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తల్లిబిడ్డలను అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఇంతటి మంచి పథకాలు అమలు చేస్తున్న సిఎం కేసిఆర్‌ ను నిండు మనసుతో దీవించాలని కోరారు.