– టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒకటే పార్టీలు
– ఇచ్చిన హావిూలను విస్మరించడంలో మోడీ, కేసీఆర్‌లు కవలలు
– ఐదు రాష్ట్రాల్లో ఏర్పాటయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్
హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయమని, ప్రజాకూటమి
గెలుపు తధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ జోస్యం చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం.. ఈ మూడు వేరు వేరు పార్టీలు కాదని, ఆ మూడు ఒకటేనని చెప్పారు. ఈ మూడు పార్టీలకు ఢిల్లీలో ఒకరే కామన్ నేత ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు ఒకటేనని గుర్తుచేశారు. బీజేపీ, ఎంఐఎం పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ కూడా బీజేపీతో ఇలాంటి ఒప్పందమే చేసుకుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పగలు తిట్టుకుంటాయని, రాత్రయితే ఒప్పందాలు చేసుకుంటాయని విమర్శించారు. ఇచ్చిన హావిూలు గాలికి వదిలేయడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ కవలలు అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. దేశంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడేవారిని.. ప్రజలు కూడా ఇంట్లోనే కూర్చోపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో తిరిగి సేవ చేయాలనుకునే వారికే అధికారం ఇవ్వాలని విజఙప్తి చేశారు. పాతబస్తీలో అభివృద్ధి జరగకుండా ఉండటానికే ఎంఐఎం పార్టీ.. టీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సహకారం కోసం ఎంఐఎం పాకులాడుతోంది తప్ప.. పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాదని చెప్పారు. కబ్జాలు చేసేందుకే ఎంఐఎం.. ప్రభుత్వాన్ని వాడుకుంటుందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల నుంచి ఎంఐఎం నేతల ఆస్తులు ఎంత పెరిగాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేంద్ర, రాష్టాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతోందని ఆజాద్ మండిపడ్డారు.
ఐదు రాష్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలో ఉన్న అందరు కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి విూటింగ్ కూడా పెట్టారని తెలిపారు. బేటీ బచావో.. బేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల విూద అత్యాచారాలు గతంలో కంటే ఇప్పుడే పెరిగాయని పేర్కొన్నారు. కేసీఆర్ విద్యా వ్యతిరేకి, ఫీజ్ రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండ పని చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రజాకూటమిదే విజయం




