Thursday, 5 November 2026

తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం

ఇప్పటికే 65కోట్లు పట్టివేత

నామినేషన్లతో పెరగనున్న ఖర్చులు

ప్రత్యేక బృందాలతో ఇసి నిఘా

హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగనున్నది. 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 12ననే నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ తరుణంలో భారీగా డబ్బు పట్టుబడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పెద్దెత్తున డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ధన ప్రభావం అనూహ్యంగా ఉండే నియోజకవర్గాలపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది.శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ఓటరును తమవైపు

తిప్పుకోవడానికి అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీయ బోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ డబ్బు, మద్యం ప్రభావం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 15 నియోజకవర్గాల్లో డబ్బు ప్రవాహం వెల్లువెత్తుతుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రాథమికంగా తేల్చిన దరిమిలా ప్రముఖులు పోటీ చేసే నియోజవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్బోతున్నారు. దీనికితోడు ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలుకాకముందే ఇప్పటి వరకు 64కోట్లు పట్టుబడ్డాయి. 2014 ఎన్నికల్లో రూ.76 కోట్ల నగదు పట్టుబడింది. ఈ ఎన్నికల్లో ఇప్పటికే రూ.64కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నామినేషన్లు కూడా ప్రారంభం కాక ముందే ఇంత పెద్ద ఎత్తున నగదు దొరుకుతుండడంతో పూర్తి స్థాయిలో ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉండబోతోందోనని అధికారులు అంచనాలు కడుతున్నారు. గత ఎన్నికల్లో ఆ 15 నియోజకవర్గాల్లో ఓటర్లకు తాయిలాలు, డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరిగినట్లు ఈసీ గుర్తించింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా కలిసి కాస్త అటూ ఇటుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందాయి. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టుబడిన నోట్ల కట్టల్లో అయిదో వంతు ఈ నియోజకవర్గాల్లో వినియోగించేందుకే రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మద్యం, చీరలు, వివిధ రకాల వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, షాద్‌నగర్‌, వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో స్థిరాస్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడా డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల రాష్ట్రంలో ధన ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. నామినేషన్లు వేసే రోజు నుంచి ఎన్నికల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ధన ప్రభావంపై నిఘా పెడతామని అన్నారు.. ముఖ్యంగా డబ్బు, ప్రలోభాల ప్రభావం భారీగా ఉంటుందని అధికారులు గుర్తించిన 15 నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారు. నగదు, మద్యం, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వస్తువులు, కూపన్ల పంపిణీ తదితర అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఆయా నియోజకవర్గాలకు వచ్చే అన్ని మార్గాల దగ్గర చెక్‌పోస్టులు

ఏర్పాటు చేసి, సంచార బృందాలను నియమించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.