రాహుల్,అమిత్ షా, మాయావతిల సుడిగాలి పర్యటన
దీటుగా ప్రచారం చేపట్టిన కెసిఆర్
హైదరాబాద్,నవంబర్28(జనంసాక్షి): తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రస్థాయి నేతలంతా రాష్ట్రాన్ని చుట్టివస్తుంటే.. మరోవైపు అన్ని పార్టీలు తమ జాతీయ నేతలను రంగంలోకి దింపాయి. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా,బిఎస్పీ అధ్యక్షురాలు
మాయావతిలు సుడిగాలి పర్యటన చేపట్టారు. వీరికితోడు కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులు కూడా పర్యటిస్తున్నారు. అమిత్‌షా, మాయావతిలు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. రాహుల్ గాందీ కొడంగల్‌లో తొలి సభలో పాల్గొన్నారు. ఇకపోతే గులాబీ అధినేత కేసీఆర్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తూ రోజుకి ఆరేసి సభల్లో ప్రసంగిస్తున్నారు. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ సైతం అటు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రచారం చేస్తూనే గ్రేటర్‌లో రోడ్‌షోలతో దూసుకుపోతున్నారు. బుధవారం కెసిఆర్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో సభల్లో ప్రచారం చేపట్టారు.
జాతీయ నేతలంతా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. నేతల మాటల తూటలతో తెలంగాణ యుద్ధభూమిని తలపిస్తోంది. ఇదిలావుండగా ఈసారి ఎలాగైనా తెలంగాణ గడ్డపై జెండా పాతాలని కాంగ్రెస్, బీజేపీలు ఉవ్విళూరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో కీలకంగా భావించే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లను కాదని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మేడ్చల్ సభలో పాల్గొని ప్రచారశంఖాన్ని పూరించారు. సోనియాతో పాటు ఓ విడుత తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ రెండో విడుత ప్రచారం కోసం బుధవారం రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ సభలో పాల్గొని, మహాకూటమి నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖమ్మం బహిరంగ సభకి ఆయన హాజరయ్యారు. రాహుల్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహాకూటమి నేతలంతా ఖమ్మం సభ వేదికను పంచుకున్నారు. దీంతో ఖమ్మం రాష్ట్ర ప్రజలు దృష్టిని ఆకర్షించింది. రెండు రోజుల రాహుల్ పర్యటనలో రోడ్‌షోలతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో పాటు పోటాపోటీ సభలతో బీజేపీ దూసుకుపోతోంది. మేమేవిూ తక్కువ కాదంటూ కమల దళం కూడా ఎన్నికల రణరంగంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇది వరకే ఓ విడత ప్రచారంతో సవాలు విసరగా.. బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభ ద్వారా రెండో విడుత ప్రచారాన్ని చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతంమంగళవారం నిజామాబాద్, పాలమూరు సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారం కోసం నిర్మల్, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు.
తెలంగాణలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం




