హైదరాబాద్ :తెలంగాణ, ఆంద్రా రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి.. భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలో 18 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 18వేల 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రాజెక్టులోని 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అటు శ్రీశైలం డ్యాం కూడా నీటితో కళకళాడుతోంది. జూరాల జలాశయం నుంచి వచ్చి చేరుతున్న నీటితో శ్రీశైలం జలకళను సంతరించుకుంది. మూడు రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 58,280 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 885 అడుగులుకాగా ప్రస్తుతం జలాశయంలో 812.30 అడుగుల మేర నీరుంది. సుంకేశుల బ్యారేజీ వద్ద కూడా వరద పోటెత్తుతోంది.. ఇక్కడ 43వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే.. దిగువకు 40,280 క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నారు. ప్రస్తుతం పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని వదిలిపెడుతున్నారు.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటితో నిండిన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీవర్షం కుషాయిగూడ, ఈసీఐఎల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ లో రోడ్లన్నీ నీట మునిగాయి.. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. భారీ వర్షాలతో ఏపీ సెక్రటేరియట్లో చెట్టు విరిగి ఓ వాహనంపై పడింది.. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకోవైపు పిడుగులూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.. ఈ ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు.
తెలంగాణ, ఆంద్రా రాష్ట్రాల్లోభారీ వర్షాలు..




