Wednesday, 4 November 2026

తెలంగాణ అభివృద్దికి కరెంట్‌ ఒక్కటి చాలు

నిజాలను గుర్తించాలని అన్న మంత్రి తలసాని

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని భయపెట్టిన మాట వాస్తవమా కాదా అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు.న పరిశ్రమల వాళ్లు కరెంట్‌ కోసం నానాయాతన పడ్డారని, ఇప్పుడు నిరంతర విద్యుత్‌తో హాయిగా ఉన్నారని అన్నారు. ఆరుమాసాల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసి పారిశ్రామికవేత్తలతో శభాష్‌ అనిపించుకున్నదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏ లాభం జరుగలేదని ఎవరైనా అనగలరా అని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ వారే కాకుండా అన్ని పార్టీల నేతలు కూడా తమ ఇండ్లు, కార్యాలయాల్లో దశాబ్దాల తరబడి జనరేటర్లు వినియోగించారని, ఇప్పుడు ఆ డీజిల్‌ ఖర్చు మిగిలింది నిజం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. నాడు ఒక సబ్‌స్టేషన్‌ కావాలంటే పైరవీలు చేసినా మంజూరు కాలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెయ్యికిపైగా సబ్‌స్టేషన్లు ఎలాంటి పైరవీలు లేకుండా ఎవరూ అడగకుండానే ఏర్పాటు చేశామని చెప్పారు. కరంటు సాకుతో ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చి అసలు తెలంగాణ రాష్ట్రం వద్దనేస్థాయిలో ఉద్యమాలు చేయాలనే కుట్రతో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుయుక్తులు పన్నారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి 53 శాతం విద్యుత్‌ తెలంగాణకు రావాల్సి ఉండగా మూడు శాతం కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో నేడు అందరికంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు