*తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి* *జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి*
నిర్మల్,బ్యూరో, జూన్ 2: జనంసాక్షి,,,, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసిన తర్వాత అమరవీరుల స్తూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.