కెసిఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తం చేస్తాం
మేడ్చెల్‌లో సోనియా సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్
మేడ్చల్,నవంబర్20(జనంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత సోనియాదేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమె వల్లనే తెలంగాణ సాకారమయ్యిందన్నారు. అయితే తెలంగాణ ఇప్పుడు కెసిఆర్ కబంధాల్లో చిక్కుకుందని,దానిని విముక్తం చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న తెలంగాణకు రానున్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో సభ నిర్వహణ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. సోనియా సభ ఏర్పాట్లను కీలక బాధ్యతగా తీసుకున్న రేవంత్ రెడ్డి.. మంగళవారం మేడ్చల్ సభా స్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ టూర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేరిస్తే.. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనకు ప్రజలు వేసే మార్కులు సున్నా అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్యాగాలు ప్రజలవైతే.. భోగాలు కేసీఆర్‌వి అని ఆయన విమర్శించారు.
ప్రగతి భవన్‌ను కేసీఆర్ పైరవీ భవన్‌గా మార్చేశారని, కేసీఆర్ కుటుంబంతో బందీ అయిన తెలంగాణకు విముక్తి కావాలని, డిసెంబర్ 7 లోపు రెండు వికెట్లు పడడం ఖాయమని రేవంత్ అన్నారు.




