Friday, 6 November 2026

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

– ఇంజనీరింగ్‌లో 78.24శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసిలో 90.72శాతం ఉత్తీర్ణత
– మే 25నుంచి ఇంజనీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌
– వెల్లడించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్‌, మే19( జ‌నం సాక్షి ) : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.  సచివాలయంలోని డీ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్‌ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంటర్నల్స్‌ స్లైడింగ్‌ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు. ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్‌ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణాలు పెరుగుదలతో ఇంజినీరింగ్‌ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ – 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్టాల్లోన్రి మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధప్రదేశ్‌ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్టాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.
————————————————