ఆదివాసీ రక్తంతో ఇంద్రవెల్లి ఎరుపెక్కిన రోజు
నేడు ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళి
సభకు సర్కారు అనుమతి
అదిలాబాద్, ఏప్రిల్ 19(జనంసాక్షి) : జల్, జమీన్, జంగల్ ఎజెండాగా దోపిడీకి వ్యతిరేకంగా అడవి బిడ్డలు నినదించిన రోజు , పొరకల సార్ల అండతో వడ్డీవ్యాపారులకు వ్యతిరేకంగా అడవిపై హక్కులకు, ఇంద్రవెల్లి బాట పట్టిన రోజు. తెలంగాణ జలియన్ వాలాబాగ్ సంఘటనగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో అమాయక ఆదివాసీలపై కాల్పుల ఘటన జరిగి సోమవారంతో 34 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు అమరులకు నివాళి అర్పించేందుకు సమైక్య రాఫ్ట్రంలో గత ప్రభుత్వాలు అనుమతి నిరాకరించగా, స్వరాష్ట్ర ప్రభుత్వం మాత్రం సభ నిర్వహించేందుకు అంగీకరించింది. హక్కుల సాధన కోసం, జల్, జంగల్, జమీన్‌పై ప్రశ్నించినందుకే అమాయక ఆదివాసీలపై పోలీసులు తూటాలు ఎక్కుపెట్టారు. తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచిన ఆత్మగౌరవానికి ప్రతీక ఇంద్రవెల్లి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలపై పెత్తందార్లు, అటవీఅధికారులు, భూస్వాములు, వ్యాపారులు సాగించిన అణచివేత ధోరణి, దోపిడీకి వ్యతిరేకంగా పీపుల్స్‌వార్ పార్టీ అనుబంధ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో 1981లో ఏప్రిల్ 20న సభ పెట్టాలని నిర్ణయించారు. ముందుగా అనుమతిచ్చిన పోలీసులు తర్వాత నిరాకరించి 144 సెక్షన్ విధించారు. విషయం తెలియని ఆదివాసీలు భారీగా వచ్చారు. ఆ రోజు సోమవారం అంగడీ కూడా కావడంతో చీమలపుట్టల్లా వచ్చిన ఆదివాసీలను చూసి పోలీసులు హడలెత్తారు. ర్యాలీగా వస్తున్న ఆదివాసీలపై లాఠీచార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరపగా 13 మంది మృతిచెందారని, అనేకమంది గాయపడ్డారని ప్రకటించారు. కానీ 60 మందికిపైగా చనిపోయారని, వందలాది మందిగాయపడ్డారని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ఈ ఘటనకు గుర్తుగా అమరవీరులకు నివాళులు అర్పించేందుకు ఏటా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆదివాసీల్లో మళ్లీ చైతన్యం వచ్చి ఉద్రిక్తతలు తలెత్తుతాయనే భయంతో ఏటా ఏప్రిల్ 20న 144 సెక్షన్ విధించి అప్రకటిత కర్ఫ్యూ కొనసాగించటం సమైక్య రాష్ట్రంలో అనవాయితీగా మారింది. కానీ స్వరాష్ట్రంలో నేడు ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళి అర్పించేందుకు, సభను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమితినిచ్చింది. దీంతో ఆదివాసీలు ఈ సంవత్సరం ఎటువంటి భయాందోళనలు లేకుండా అమరవీరులకు ఘన నివాళి అర్పించనున్నారు.
అసలు ఆనాడు ఏం జరిగింది? ఆదిలాబాద్ అడవుల్లో ఆమాయకంగా జీవనం సాగించే అడవి బిడ్డలు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి అమరవీరుల దినంగా చరిత్రలో ఎందుకు నిలిచిపోయింది? అన్న విషయాల్లోకి వెళ్తే… ఆదివాసీలు తమ హక్కుగా భావించే అడవితల్లి సంపద పెత్తందార్లు దోచుకోవడం ఎక్కువైంది. అడవుల్లో పుట్టిపెరిగిన ఆదివాసీలు.. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించేవారు.. అటవి ఉత్పత్తులు వారి ఆస్తిగా భావించేవారు.. అడవుల్లో దొరికే పండ్లు పలాలు మొర్రిపలుకులు, సారపలుకులు, జీడిపండ్లు, తుమ్మ బంక, ఇప్పకర్ర, తేనె, తునికాకు, ఇప్పపూలు, వెదురు తడకలు వంటి వాటిపైనే వారు ఆధారపడి జీవించేవారు.. అయితే, ఈ విలువైన.. పౌష్టికాహార వంతమైన అటవీ ఉత్పత్తులను అటవీ అధికారులు, వ్యాపారులు, ఉప్పుకోసం.. ఉల్లిగడ్డల కోసం.. వస్తుమార్పిడితో అతి చౌకగా కొనుగోలు చేసేవారు. ఒక గిన్నెడు మొర్రి పలుకులు.. ఒక గిన్నెడు ఉప్పుకు తీసుకునేవారు.. ఇలా అటవీ ఉత్పత్తుల్లో అడవిబిడ్డలు దోపిడీకి గురయ్యేవారు. అడవుల్లో కొద్ది పాటి పోడు వ్యవసాయం చేసుకుంటున్నా దానిపై భూస్వాముల పెత్తనమే ఉండేది. అడవుల్లో పోడు చేసుకుంటున్న భూములపై జంగ్లాత్ అధికారులు అడవి బిడ్డల పంటలను లూటీ చేసేవారు. పండిన జొన్నలు, పప్పు దినుసులు వారి జబర్దస్తీతో తీసుకుపోయేవారు.. అడవులు, వాటి ఉత్పత్తులు, పోడు వ్యవసాయం గిరిజనుల చేతిలోనే ఉన్నా.. వాటి ఫలాలను మాత్రం వ్యాపారులు, అటవీ అధికారులు అనుభవించేవారు. అమాయక అదివాసీల గుండెలు మండినా.. వారిని ఎదిరించే సాహసం చేసేవారు కాదు.. నిత్యం గిరిజనుల పంటలు దోపిడీకి గురయ్యేవి. అడవిలో ఆకుల దోపిడీ.. అంతులేకుండా జరుగుతుండేది.
సరిగ్గా ఇదే సమయంలో పొరుకల సార్లు ఆదిలాబాద్ అడవుల్లో అడుగుపెట్టారు. అమాయక అడవిబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను, దళారీ, అటవీ అధికారుల దోపిడీలను కళ్లారా చూశారు. గిరిజనులను మెలమెల్లగా చైతన్యవంతులను చేయటం మొదలు పెట్టారు.. అటవీ ఉత్పత్తులకు ఉన్న విలువను తెలియజేశారు.. పోడు వ్యవసాయం, భూములు ఆదివాసీలవేనని. వాటిపై హక్కులు అడవి బిడ్డలకే ఉన్నాయని తెలియజేశారు. మెలిమెల్లిగా అడవి బిడ్డలు చైతన్యవంతులు కావటం మొదలైంది. పొరుకల దొరల మాటల్లో వాస్తవాలను గమనించి ఆదివాసీలు క్రమంగా వారికి దగ్గరయ్యారు. అటవీ ఉత్పత్తులను డబ్బులకే కాని ఉప్పుకు బదులీయమని దళారులకు ఎదురు చెప్పటం.. అటవీ అధికారుల పెత్తందారి తనాన్ని ఎదిరించటం. పోడు భూములు తమవేనని ఎదురు తిరటం మొదలు పెట్టారు. ఎక్కడైనా.. ఎవరైనా అధికారి గాని.. వ్యాపారులు గాని తమకు ఇబ్బంది కలిగిస్తే గిరిజనులందరు ఒక చోటికి వెంటనే చేరేందుకు తుడుం మోగించటం మొదలు పెట్టారు. దీంతో ఆదివాసీలందరు ఏకమై అటవీ అధికారులు, దళారుల ఆగడాలను అరికట్టటం.. ఎదరు తిరిగిన వారికి బుద్ధి చెప్పటం జరుగుతుండేది.. దాంతో అటవీ అధికారులు, దళారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. మొత్తంగా ఆదివాసీల ప్రధాన సమస్య అయిన భూమి సమస్యను పరిష్కరించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయని అన్నలు ఆదివాసీలకు తెలియజేయటంతో ఆ దిశగా గిరిజనులు చైతన్యవంతులు కావటం మొదలైంది.
1981లో నక్సలైట్లకు అనుబంధ సంఘంగా పనిచేస్తున్న రైతుకూలీ సంఘం అప్పట్లో అద్యక్షునిగా పనిచేసిన తొడసం కట్టి ఆధ్వర్యంలో ఏకమైన ఆదివాసీలు తమ సమస్యలపై గర్జించేందుకు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 1981 ఏప్రిల్ 20 సభను నిర్వహించుకోవాలని కొద్ది నెలల ముందుగానే తుడుం మోగించారు. గ్రామాల్లో రైతుకూలి సంఘం విస్తత ప్రచారం చేసింది. ముందుగా సభను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చిన అప్పటి ఆర్డిఓ, పోలీసులు సరిగ్గా ఇదే సమయంలో వ్యాపారులు కూడా సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. తరువాత రైతుకూలీ సంఘం ఏర్పాటు చేసిన ఆదివాసీల సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పుడు విూడియా అంతగా లేక పోవటంతో ఎక్కువగా ప్రచారం లేక ఈ విషయం ఆదివాసీలకు తెలియలేదు.. పైగా ఆరోజు ఇంద్రవెల్లిలో 144 సెక్షన్ విధించారు. ఇక ఏప్రిల్ 20 రానే వచ్చింది. ఆ రోజు సోమవారం ఇంద్రవెల్లిలో అంగడి. ఉదయం నుంచే గిరిజనులు గ్రామాల నుంచి తరలి రావటం మొదలైంది. 144 సెక్షన్ విధించినట్లు ఆదివాసీలకు తెలియదు. అంగడి కోసం కొందరు, సభకోసం మరికొందరు -ఇలా వందలాది మందితో ఇంద్రవెల్లి నిండిపోయింది. ఆదివాసీలు సాధారణంగా తాము ఎటైన ప్రయాణం చేస్తే వారితోపాటు ఏదైన ఒక ఆయుధం వెంట తీసుకెళ్తారు. అడవుల్లో ఉంటే వీరికి క్రూర జంతువులనుంచి ఆత్మరక్షణ కోసం సాధారణంగా కొడవలి, గొడ్డలి, బరిసే వంటి వాటిని వెంట తెచ్చుకుంటారు. అయితే ఇంద్రవెల్లి సభకు వచ్చే టప్పుడు కూడా ఈ ఆయుధాలను వారు వెంట తెచ్చుకున్నారు. సభకు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ముందుగా పోలీసులు ఊహించినప్పటికీ వేలాది గిరిజనులు తరలివస్తారని పోలీసులుగాని, అధికారులు గాని భావించలేదు. అసంఖ్యాకంగా తరలి వచ్చిన ఆదివాసీలతో హడలెత్తిపోయిన అధికారులు అప్పటికప్పుడు పోలీసుల దళాలను రంగంలోకి దింపారు. సభను నిర్వహించేందుకు సభావేదిక వద్దకు ఆదివాసీల ర్యాలీ ప్రారంభమైంది. పోలీసులు వీరికి అడుగడుగునా అడ్డు తగులుతూ వెంటే నడిచారు. ఈ నేపథ్యంలో ఒక గిరిజన మహిళతో పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది.. ఆత్మాభిమానం గల ఆదివాసీ మహిళ పోలీసుల మాటలను భరించలేక తన వద్దనున్న కొడవలితో పోలీసుపై ఒక్కవేటు వేసింది. అంతే! ఆ పోలీసు అక్కడే కుప్పకూలి పోయాడు.. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో పోలీసులు రెచ్చిపోయారు.. అప్పుడు ఆదిలాబాద్ ఆర్డీఓగా పనిచేసిన అంబరీష్ కాల్పులకు ఆదేశాలిచ్చారు. దీంతో వందలాది మంది పోలీసులు వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలపై తుపాకీ గుండ్ల వర్షం కురింపిచారు.. అడవి బిడ్డలు అడవుల వెంటా.. చెట్ల మాటుకు, పుట్టల మాటుకు పరుగెత్తారు. చెల్లాచెదురై పోయారు. విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో 13 మంది గిరిజనులు చనిపోయారని, అనేక మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. కానీ జరిగింది వేరు. 60 మందికిపైగా చనిపోవడమేకాక, వందలాది మంది గాయాలపాలయ్యారని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. ఆ అమరులందరికీ స్వరాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు అనుమతించటంతో నివాళులు అర్పించే అవకాశం దక్కింది.





