
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19(జనంసాక్షి) :
రైతుల హక్కులను కాలరాసేందుకే భూసేకరణ బిల్లు అని, తమ సర్కారు తెచ్చిన భూసేకరణ బిల్లును కొనసాగింఛకుండా పెట్టుబడిదారుల కొమ్నుకాసేలా భూ సేకరణ చట్టాన్ని తీసుకొస్తున్నారనిస మోదీ సర్కారుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. ఇది తమకు వ్యతిరేకమై ప్రభుత్వమని దేశంలోని రైతులు భావిస్తున్నారని ఆయనన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతుందని రాహుల్ అన్నారు. దేశంలో 50 ఏళ్ల చెత్తను శుభ్రం చేస్తున్నానని మోడీ చేసిన ప్రకటన తనకు బాధ కలిగించిందన్నారు. మోడీ ప్రభుత్వం పైపై మెరుగులతో అందర్నీ మోసం చేస్తోందని రాహల్ దుయ్యబట్టారు.
దేశంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కిసాన్ ర్యాలీ జరిగింది. ఈ సంర్భంగా రాహుల్ మాట్లాడుతూ కార్పొరేట్ వర్గాల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. విదర్భ, బుందేల్‌ఖండ్‌కు యుపీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని, పేదలను పట్టించుకున్నది యుపీఏ ప్రభుత్వమేనని ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రైతు అనుకూల భూసేకరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మార్చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. బలవంతంగా రైతుల వద్ద నుంచి భూమి లాక్కుంటోందని ఆయన మండిపడ్డారు. ఆదివాసీలను కలిశానని, వారి వికాసం కోసం ఎంత కృషి చేశారని ఆయన తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేసింది కూడా యుపీఏ ప్రభుత్వమేనని రాహుల్ పేర్కొన్నారు. రైతుల రుణభారం తగ్గించేందుకు రూ. 70 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. ఆహారభద్రత చట్టం సహా పేదల కోసం అనేక పనులు చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడిందని, ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తుందని రాహుల్ విమర్శించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో రైతులకు భవిష్యత్ లేదని రాహుల్ విమర్శించారు. ఐటీ కన్నా ముందు దేశంలో వ్యవసాయం ఉందని ఆయన అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టి, ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత నక్సలిజం వైపు మళ్లుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని ఆయన విమర్శించారు. మోదీ విదేశీగడ్డపై భారత్‌ను విమర్శించడం తగదని రాహుల్ సూచించారు. భూసేకరణ బిల్లు తయారు చేసేందుకు మాకు రెండేళ్లు పట్టిందని, దాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఇష్టానుసారంగా బిల్లులో సవరణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం యుపీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతులను నట్టేట ముంచిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు.




