Friday, 6 November 2026

తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు

టిఆర్‌ఎస్‌ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా

లేఖను తెలంగాణ భవన్‌కు పంపిన ఎంపి

పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో రాజకీయాల్లో భారీ కుదుపు.. ఎన్‌ఇనకల వేల అధికార పార్టీకి చెందిన ఓ ఎంపి రాజీనామా ప్రకటన ..రాజకీయంగా పెను సంచలనం సృష్టించే వార్తగా శరవేగంతో ప్రచారం..అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తెరాసకు గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన అనూహ్యంగా ప్రకటించారు. ఇటీవలే ఇద్దరు ఎంపిలు టిఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వబోతున్నారన్న వార్తలను ఖండించిన కొండా అనూహ్యంగా రాజీనామా సమర్పించారు. పార్టీ జరుగుతన్న పరిణామాలతో వికలం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. ప్రధానంగా ఐదు కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. తెరాసలో సరైన గౌరవం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నకార్యకర్తలకు సరైన గౌరవం లేదని పేర్కొన్నారు. తెరాసలో సంప్రదాయ రాజకీయాలు లేవని తెలిపారు. పార్టీ, రాష్ట్ర స్థాయిల్లో ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు. ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పనిచేశానన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందని తనకు అనిపించిందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాసలో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి గెలుపొందారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన బుధవారం విూడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేటీఆర్‌తో భేటీ అనంతరం రేవంత్‌ వ్యాఖ్యలను కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఖండించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన అనూహ్యంగా ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది.