Wednesday, 4 November 2026

తెలంగాణ వ్యతిరేఖ టీడీపీతో..  కాంగ్రెస్‌ పొత్తా!

– తెలంగాణ ప్రజల బతుకులను నాశనం చేసేందుకే మహాకూటమి
– అలాంటి కూటమి జెండాలను బండకు కొట్టండి
– వ్యవసాయాన్ని బతికిస్తేనే అందరం బతుకుతాం
– వ్యవసాయం పండుగలా కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం
– ఆపద్ధర్మమంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
– తెరాసలో చేరిన పలు గ్రామాల ప్రజలు
సూర్యాపేట, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : తెలంగాణను వ్యతిరేఖించిన టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవటం దుర్మార్గమైన చర్య అని, అలాంటి కుట్రపూరిత పొత్తులను తిప్పికొట్టాలని ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్‌ యస్‌ మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు శనివారం ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి సమక్షంలో టి ఆర్‌ యస్‌ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, సూర్యాపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వై.వి,సీనియర్‌ టి ఆర్‌ యస్‌ నేత కాకి కృపాకర్‌ రెడ్డి, ఆత్మకూర్‌ యస్‌ యం.పి.పి లక్ష్మీ బ్రాహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ మంత్రి మాట్లాడుతూ.. ఇది పార్టీల పంచాయతీ కాదని, తెలంగాణా ప్రజల బతుకుదేరువును నాశనము చేసిన జెండాలను బండకు కొట్టండని  పిలుపునిచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ ల నిర్మాణాన్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ తో
కాంగ్రెస్‌ పొత్తా? వ్యవసాయాన్ని బతికిస్తేనే అందరం బతుకుతామన్నారు. 60 ఏండ్లుగా ఓట్లు వేసి గెలిపించిన పార్టీలు వ్యవసాయం గురించి ఏ ఒక్క రోజు ఆలోచించలేదున్నారు. రుణమాఫీ చెయ్యడం కాదని, అప్పు లేకుండా వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. యావత్‌ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరుపమే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకే రైతు భీమా పథకం అమల్లోకి తేవడం జరిగిందన్నారు. మరణించిన 48 గంటల వ్యవధిలో రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెల్లింపు చేస్తున్నట్లు తెలిపారు. 2014 కు ముందు తెలంగాణా ఉద్యమానికి ముందు పాలించిన పార్టీలన్నీ ఆంధ్రా పాలకులకు మడుగులు ఒత్తినవేనని, ఒక్క దాచారం గ్రామానికే ఫించన్‌ ల రూపంలో ఇప్పటివరకు చెల్లించింది మూడు కోట్ల పై చిలుకు అన్నారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయారన్నారు. ఓట్లకోసం వస్తున్న కూటమి నేతలను నిలదీయండని పిలుపునిచ్చారు. యావత్‌ భారతదేశంలో ఉచితంగా నిరంతర విద్యుత్‌ నందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణానేనని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు నుండి రాహుల్‌ గాంధీ వరకు కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించిన వారి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ లో ఉచిత విద్యుత్‌ కాదుకదా ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు అసలు విద్యుత్‌ లేదని విమర్శించారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇటువంటి పార్టీలకు ఓటువేస్తే తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిచి పోతాయి అన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్‌ నిర్మాణాలు ఆగిపోతాయన్నారు. కళ్యాణాలక్ష్మి పధకానికి తిలోదకాలు ఇస్తారని, కులవృత్తులను ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు చేపట్టిన ప్రణాలిలకు బ్రేక్‌ పడుతుందని, కేసీఆర్‌ కిట్‌ పధకానికి చరమగీతం పాడుతారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలకు మంగళం పాడే పార్టీలకు ఓటువేస్తే నిండా మునుగుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే సంక్షేమం సాధ్యమవుతుందని, గులాబీ గూటికి చేరుదాం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అండగా నిలబడదామని జగదీశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.