– అనారోగ్యంతో బాధపడుతూ మృతి
– సంతాపం తెలియజేసిన సీఎం కేసీఆర్
– ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరనిలోటన్న సీఎం
వరంగల్, అక్టోబర్13(జనంసాక్షి) : ప్రముఖ సంస్కృత పండితుడు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య (93) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో వరంగల్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వరంగల్‌లో వేదపాఠశాలను నెలకొల్పి అనేక మంది శిష్యులకు ఆయన వేదం బోధించారు. జీయర్ స్వాములకు గురువుగా నిలిచిన రఘునాథాచార్య.. పలు గ్రంథ రచనలతో పాటు, పరిశోధనల్లో పేరు గడించారు. తన ఉపన్యాసాలతో సంస్కృత భాషా సేవ చేశారు. పలు ఆలయాల జీర్ణోద్ధరణకు పాటుపడ్డారు. రఘునాథాచార్య సేవలకు గుర్తింపుగా తెలుగు రాష్టాల్లో అనేక సత్కారాలు, బిరుదులు లభించాయి. 1970లో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి.. ఉభయ వేదాంత ఆచార్య, 1972లో రాష్ట్రపతి జాతీయ పురస్కారం, 1999లో రాష్టీయ్ర సంస్కృత విద్యాపీఠం, తిరుపతి నుంచి మహా మ¬పాధ్యాయ బిరుదుతో పాటు అనేక సత్కారాలు అందుకున్నారు. 2008లో కాకతీయ విశ్వవిద్యాలయం రఘునాథాచార్యను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
ఆధ్మాత్మిక ప్రపంచానికి తీరని లోటు – సీఎం కేసీఆర్
రఘునాథాచార్య మృతికి తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రఘునాథాచార్య మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరనిలోటని సీఎం పేర్కొన్నారు. వైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా రఘునాథాచార్య నిలిచారని సీఎం కొనియాడారు. తన ప్రవచనాలతో ఆధ్యాత్మిక చింతన కలిగించిన మహా మనిషని కేసీఆర్ కొనియాడారు.
ప్రముఖ పండితుడు.. రఘునాథాచార్య కన్నుమూత




