గోదావరి తీరాల్లో పుణ్య స్నానాలు
శైవాలయాలకు పోటెత్తిన భక్తులు
కాళేశ్వరం,వేములవాడలకు భారీగా భక్తుల రాక
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): రాష్ట్రంలోని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని గోదావరి నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. నదుల్లో స్నానాలు చేసి, దీపాలను వదిలి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు.
పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ప్రధాన ఆలయాలు కిలకిటలాగాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం పౌర్ణమితో కూడిన సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక
సోమవారం పురస్కరించుకుని శైవాలయాల్లో అభిషేకాలు చేపట్టారు. పుణ్యతీర్థాల్లో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలుచేశారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళలు పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు దీపాల కాంతులతో వెలిగిపోయాయి. అలాగే భద్రాచలంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం గోదావరి వద్ద పుణ్యస్నానాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తిక పౌర్ణమి మూడో సోమవారం కావటంతో గోదావరి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రముఖ దివ్య క్షేత్రం యాదాద్రి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు యాదగిరీశుడిని దర్శించుకుంటున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకొని అంకురార్పణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జ్వాలా తోరణం కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి తీరంలో సరస్వతీ దేవస్థానం, స్థానిక వేదభారతి పీఠం ఆధ్వర్యంలో గోదారమ్మకు మహా హారతి పూజ నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆదివారం రాత్రి అఖండ జ్యోతిని వెలిగించారు. యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, కాళేశ్వరం,కీసర, ధర్మపురి, వరంగల్లోని వేయి స్తంభాల గుడి,రామప్ప ఆలయం, కొడవటూరు ఆలయాలకు భక్తుల పోటెత్తారు. నల్లగొండ ఛాయా మహేశ్వరాలంలో భక్తులు పోటెత్తారు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసరలో ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి స్నానాలు ఆచరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి స్నానాలు చేసి, నదిలో దీపాలను వదిలారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. అలాగే పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు. ఉసిరి, మారేడు చెట్టు వద్ద లక్ష లక్ష దీపాలను వెలిగించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ధర్మపురికి చేరుకున్నారు. మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి, దీపాలు వదిలి నదీమాతకు పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చి, పుచ్చుకున్నారు. అనంతరం ఆలయంలో బారులు యోగ, ఉగ్రనారసింహుడిని దర్శించుకున్నారు. అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఉసిరి చెట్టు కింద లక్ష దీపాలను వెలిగించారు. బ్రాహ్మణులకు దీపాలను దానం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు




