ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలో జోరుగా వానలు
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
హైదరాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో నల్లకుంట వాగు పొంగుతోంది. దీంతో నర్సింహులగూడెం – పోచారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముదిగొండ మండలం చిరిమరిలో చెరువు అలుగు పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. మణుగూరు మండలంలో కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో చెరువుకట్ట తెగిపోయింది. 150 ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బోనకల్లు మండలంలోని కలకోట పెద్ద చెరువు పోస్తుండటంతో.. భారీగా గ్రామస్తులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చెరువు విస్తీర్ణం 463 ఎకరాలు. చెరువుకు భారీగా నీరు రావడంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు చేరుకుంటున్నారు. ఇక చెరువు వద్ద యువకులు సెల్ఫీలు దిగుతున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహాదేవాపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మహాముత్తారం – కాటారం మధ్య లోలెవల్ వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తోంది. ధౌత్‌పల్లి, పోతులవాయి వాగులు పొంగుతున్నాయి. వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. అన్నారం బ్యారేజీ వద్ద కరక్కట్ట నిర్మాణం పనులు నిలిచిపోయాయి. కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాంక్రిట్ పనులు నిలిచిపోయాయి. మందమర్రిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కల్యాణికణి, ఆర్‌కేపీ ఉపరితల గనుల్లో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బైరిగూడలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
శ్రీరాంపూర్‌లో ఉపరితల గనిలో మట్టి పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షం పడుతోంది. వర్షాల కారణంగా వ్యవసాయ పనులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాయగూడెం వద్ద గోదావరిలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులు నదిలో చిక్కుకుపోయాయి. జాలర్ల సాయంతో యువకులను బయ్యారం పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లికుదుర్, గూడూర్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, కురవి, బయ్యారం, గార్ల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. గత వారం రోజులుగా ఉక్కపోతతో విసిగిన ప్రజలకు చల్లటి గాలులు ఎంతో సంతోషన్నిచ్చాయి. పూత దశలో ఉన్న పత్తి, పెసర తదితర పంటలకు, నాట్లు వేసిన రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని అన్నదాత సంతోషంగా ఉన్నాడు. మరో పక్క జిల్లాలోని ఆకెరు, పాలేరు, మున్నేరు, మొండి వాగులలోకి నీరు చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.




