Wednesday, 4 November 2026

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధప్రదేశ్‌ లో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, సోమవారం కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు తీవ్ర స్థాయిలో ఎండలు మండిపోయాయి. వేసవికాలాన్ని తలపించేలా వారం రోజులు పాటు ఉష్ణోగ్రతలు అధికశాతం నమోదయ్యాయి. కాగా శనివారం ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రజలు కొంత సేదతీరుతున్నారు. మరోవైపు జూన్‌ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలతో వర్షాలు పడటంతో అన్నదాతలు ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విత్తనాలు నాటారు. దీంతో మరో వారం రోజులు పాటు వర్షాలు జాడలేకపోవటంతో విత్తు మొలవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల్లో భూమి నుంచి మొక్క బయటకొచ్చే అవకాశాలున్నాయని రైతులు పేర్కొంటున్నారు.