Tuesday, 3 November 2026

త్వరలో డీఎస్సీ

– 16వేల టీచర్‌ పోస్టుల భర్తీ

– కడియం శ్రీహరి

వరంగల్‌,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే డిఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున.. టీచర్‌ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుభవార్త వినిపించారు. రానున్న రోజుల్లో 16 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. హన్మకొండ అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాక కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇకనుంచి అవార్డుల కోసం టీచర్లు దరఖాస్తు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతిభ ఆధారంగానే టీచర్లకు అవార్డులు ఇస్తామన్నారు. అవార్డుల కోసం పైరవీ చేయాల్సిన పరిస్థితి రావొద్దని కడియం అభిప్రాయపడ్డారు. విద్య అభివృద్ధికి గత పాలకులు కృషి చేసి ఉంటే ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి చెందేవాళ్ళం అని చెప్పారు. విద్యపైన పెట్టిన ప్రతి పైసా ఖర్చుగా భావించారని, విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేలా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించొచ్చు అని అన్నారు. 525 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు. ఈ మూడేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య పెరిగిందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల నుండే ప్రభుత్వ స్కూళ్లలో చేరారని కడియం శ్రీహరి చెప్పారు. మానవ వనరులతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ గద్దల పద్మ, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజయ్య యాదవ్‌, ఆగ్రోస్‌ చైర్మన్‌ కిషన్‌ రావు, రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అర్బన్‌ జేసీ దయానంద్‌, జిల్లా విద్యాశాఖాధికారి సున్నం శ్రీనివాసాచారి ,విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి పురస్కారాలను ముఖ్యఅతిథి కడియం శ్రీహరి చేతుల విూదుగా అందజేసారు. జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.