భారీ వర్షంతో గంటల తరబడి నిలిచిపోయిన విద్యుత్
ఈదుగాలులకు నేలకొరిగిన చెట్లు
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు
హైదరాబాద్,మే3(జనం సాక్షి): అకాల వర్షం కారణంగా కాశం మేఘావృతం కావడంతో హైదరాబాద్ నగరం పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఉన్నట్లుండి ఈదుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్‌లోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకటిమయంగా మారింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తుండగా.. హైదరాబాద్ జంటనగరాల్లోని పలు చోట్ల మధ్యాహ్నం కురిసిన భారీ వర్షబీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, ముషీరాబాద్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. భానుడి భగభగలకు అల్లాడుతున్న తమకు ఈ వర్షం కొంత ఉపశమనం కల్గించింది. ఉరుములు, మెరుపుతో పెద్ద శబ్దాలు రావడంతో ఎండాకాలంలో విచిత్ర వాతావరనం అలముకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. రాజధాని నగరంలో ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. మార్కెట్లలో దాన్యం తడసి ముద్దయింది. మద్యాహ్నం తరువాత ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు… నిమిషాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. భారీ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో వర్షం మొదలయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొదట ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికే రాష్ట్రం మొత్తం కమ్ముకుంది. వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కొద్దిసేపు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణ, విద్యుత్ వ్యవస్థలు స్థంబించాయి. మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ములుగు, వర్గల్ మండలాల్లో భారీ వర్షం పడింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంబాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కవిూషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెట్లు, విద్యుత్ తీగలు, స్థంబాలు పడిపోతే కార్పొరేషన్ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆమ్రపాలి నగర ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 8004251980 నెంబర్‌కి కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో, జనగాం జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఉరుములు, మెరువులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ
మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం ధాటికి వరి, మక్క, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వరంగల్ అర్బన్ 5 సెం.విూ, వరంగల్ రూరల్ 4 సెం.విూ, భూపాలపల్లి 4 సెం.విూ, దామెర, ములుగు 3.6 సెం.విూ వర్షపాతం, వేంసూరు (ఖమ్మం)3.3, ఉప్పలగూడెం (మహబూబాబాద్) 2.1 సెం.విూ, వర్షంపాతం నమోదయింది.
—————
దట్టమైన మేఘాలతో జంటనగరాల్లో పట్టపగలే చీకట్లు




