హైదరాబాద్,మే23(జనం సాక్షి): కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్(21) గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం రాత్రి 10.45కు వైష్ణవ్ గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. మాసివ్ హార్ట్ స్టోక్ర్‌తో వైష్టవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. వైష్ణవ్ మృతదేహాన్ని గురునానక్ ఆస్పత్రి నుంచి రాంనగర్‌లోని నివాసానికి తరలించారు. మధ్యాహ్నం మూడు గంటల తరువాత సైదాబాద్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నారు. కుమారుడి మృతితో షాక్‌కు గురైన దత్తాత్రేయ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వైష్ణవ్ మృతదేహాన్ని బంధువుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే వైష్ణవ్ ఇక లేడని తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడిని కడసారి చూసేందుకు తరలివచ్చి నివాళి అర్పించారు. దత్తన్న తన కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పలువురు నాయకులు దత్తాత్రేయ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్‌లో పరామర్శించారు. బిజెపి ఎంఎల్‌ఎ లక్ష్మణ్, ఎంఎల్‌ఎ చింతల రామచంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్,పిసిసి అధ్యక్షుడు రాఘువీరా రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, గవరన్నర్ నరసింహన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు దత్తన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైష్ణవ్ హఠాన్మరణం పట్ల సంతాపాలు వెల్లవెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి దత్తాత్రేయను పరామర్శించారు. భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ తదితరులు దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు.
సిఎం కెసిఆర్ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపట్ల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్‌లో పరామర్శించారు. వైష్ణవ్ భౌతికకాయానికి గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, హరీశ్‌రావు, జోగు రామన్న, ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అనంతరం దత్తాత్రేయ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చంద్రబాబు సంతాపం
బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణంపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. వైష్ణవ్ చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడం పెనువిషాదమన్నారు. ఎంబీబీఎస్ చేస్తూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్న వైష్ణవ్ అకాల మరణానికి గురికావడం కలచి వేసిందన్నారు. ఒక్కగానొక్క కొడుకు ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని, దత్తాత్రేయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.




