Tuesday, 3 November 2026

దరఖాస్తు చేశాం.. చూసుకోండి

చూడకుండానే అనుమతి లేదంటున్నారంటే వెనుక రాజకీయ శక్తి
బైండోవర్లు, అరెస్టులు చలో అసెంబ్లీని అడ్డుకోలేవు
కోదండరామ్‌ స్పష్టీకరణ
నల్గొండ, జూన్‌ 9 (జనంసాక్షి) :
‘చలో అసెంబ్లీ కార్యక్రమానికి దరఖాస్తు చేశాం.. దానిని చూడకుండానే అనుమతి లేదని పోలీసులు అంటున్నారంటే దాని వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది’ అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్యాయంగా మాట్లాడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని అన్నారు. బారీకేడ్లు, ఇనుప కంచెలు తమ సంకల్పం ముందు నిలువబోవని స్పష్టం చేశారు. బైండోవర్లు, అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోలేరని ఇలాంటి ప్రయత్నాలే గతంలో చేసి విఫలమైన విషయాన్ని పాలకులు గుర్తు చేసుకోవాలన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపాలనుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో హింస చెలరేగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు చేపడుతున్న చలో అసెంబ్లీకి జనం ప్రభజనంలా రావడం ఖాయమని, ఆ జనప్రవాహంతో సీమాంధ్రుల కుట్రలు పటాపంచలవడం ఖాయమన్నారు. ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామన్నారు. సమావేశంలో టీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *