దాచేపల్లి అత్యాచార ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
– బాధితులపై కఠిన చర్యలకు ఆదేశం
– ఘటన స్థలానికి వెళ్లాలని ఎస్పీ, ఐజీలకు సూచన
అమరావతి, మే3(జనం సాక్షి) : గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారం
చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్లాలని ఎస్పీ, ఐజీలను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా మంత్రి, మహిళా కమిషన్ చైర్మన్‌నుసైతం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పాల్పడిన ఎంతటివారికైన కఠిన శిక్షతప్పదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ అర్ధరాత్రి రాస్తారోకో చేశారు. దీంతో అద్దంకి, నార్కెట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికను గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని గ్రామాస్థులు డిమాండ్ చేశారు. పోలీసులు వారితో చర్చలు జరిపారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని హావిూ ఇవ్వడంతో నిరసనకారులు రాస్తారోకో విరమించారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ స్థానికులు గురువారం దాచేపల్లి బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు నిందితుడిని పట్టిచ్చివారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయండి – దాచేపల్లి ఘటనపై చినరాజప్ప
గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. జిల్లా గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అత్యాచారానికి నిరసనగా దాచేపల్లిలో జరుగుతున్న బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం చినరాజప్ప పోలీసులను ఆదేశించారు.
——————————————–