Monday, 2 November 2026

దాడిలో గాయపడ్డ పూజారి మృతి

దాడి చేసిన ఇమాంపై చర్యకు డిమాండ్‌

హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరంగల్‌ పోచమ్మ మైదానం దగ్గర సాయిబాబా ఆలయంలో యువకుడి దాడిలో గాయపడ్డ పూజారి సత్యనారాయణ మృతి చెందారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణ కన్నుమూశారు. గత నెల 26వ తేదీన తెల్లవారజామున పోచమ్మ మైదనంలోని సాయిబాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ శర్మపై ఎల్బీనగర్‌కు చెందిన సయ్యద్‌ సాదిక్‌ హుస్సేన్‌ అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఉదయమే ప్రార్థనలతో తమకు ఇబ్బంది కలుగుతోందంటూ అర్చకుడితో యువకుడు వాగ్వాదానికి దిగాడు. అయితే అర్చకుడు అతడిని నిలువరించే ప్రయత్నం చేసే క్రమంలో యువకుడు దాడి చేశాడు. దీంతో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఎంజేఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ శస్త్ర చికిత్స జరిగిన అనంతరం అతడి పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. కాగా ఈరోజు ఉదయం సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూజారిపై యువకుడి దాడి స్థానికంగా కలకలంగా రేపుతోంది. ఈ ఘటనకు కారణమైన ఇమాంపై చర్య తీసుకోవాలని స్థానిక బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.