Thursday, 5 November 2026

దూసుకొస్తున్న ‘గజ’

– భయం గుప్పిట్లో తీరప్రాంత ప్రజలు
అమరావతి, నవంబర్‌13(జ‌నంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ‘గజ’మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 750 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను నవంబరు 15న కడలూరు, పాంబన్‌ మధ్య మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ‘గజ’తుఫాను తమిళనాడు, ఆంధప్రదేశ్‌ వాసులను కలవరానికి గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖలోని ఆర్కే బీచ్‌, రుషికొండలో కెరటాలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో పర్యాటక శాఖ స్పీడ్‌ బోట్లను, ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కయాకింగ్‌ తదితర జల విన్యాసాలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కు తిరిగి వస్తున్నారు. దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఏపీలో నేటి నుంచి అక్కడక్కడ
చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబరు 14 నుంచి 16 వరకు గజ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబరు 15న మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను తీవ్రరూపం దాల్చి నవంబరు 13, 14 తేదీల్లో తమిళనాడు తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.