– ప్రధానిపై జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
– ఒక్క బీసీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉంది
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
– బీసీ జాతి రత్నం మోదీ – కన్నా
హైదరాబాద్, జూన్5(జనం సాక్షి) : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి స్పష్టమైన అధికారం కట్టబెడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఓబీసీ మోర్చా సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను లక్ష్మణ్, తదితర బీజేపీ నేతలు సన్మానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో పేద వ్యక్తి ప్రధానిగా కొనసాగుతున్నారని చెప్పారు. అలాగే మోదీ పథకాలు, పాలనను ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు మోదీని కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేత జైపాల్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు మాట్లాడినట్లుగా ఉందని విమర్శించారు. అయినా ఒక్క బీసీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దుస్థితి కాంగ్రెస్‌దని ఆరోపించారు. తెలంగాణలో తెరాస పాలన అవినీతిమయంగా మారిందని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంలో జరిగే అవినీతి, తెరాస పై ప్రజల్లో ఉన్న ఉన్న అసహనాన్ని తొలగించేందుకే థర్డ్ ఫ్రంట్ పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లులు కట్టలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. ఓబీసీ మోర్చా కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని లక్ష్మణ్ తెలిపారు.
మోదీ కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి – కన్నా
ఏ రాజకీయ కుటుంబానికి చెందని మోదీ.. దేశ ప్రధాని అయ్యారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బీసీ జాతి రత్నం మోదీ అని కొనియాడారు. వెనుకబడిన కులాల నుంచి వచ్చిన మోదీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓబీసీలదేనన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మోదీని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న ఓబీసీలంతా కలిసి.. ఐక్యంగా పోరాడాలని లక్ష్మీనారాయణ
పిలుపునిచ్చారు.
దేశంలో బీజేపీకి ప్రజల నుంచి స్పష్టమైన మద్దతుంది




