– లబ్ధిదారులు ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
– ‘పేదరికంపై గెలుపు’ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
– ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల
కాకినాడ, నవంబర్12(జనంసాక్షి) : ధనం రూపంలో కాకుండా వస్తు రూపంలో రుణాలు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆనందభారతీ గ్రౌండ్ప్ లో సోమవారం పేదరికంపై గెలుపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ధిక మంత్రి యనమల
రామకృష్ణుడు పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ పధకాల్లో లబ్దిదారులకు రుణాలు, ఉపకరణాలు అందజేశారు. కాకినాడ సబ్ డివిజన్ పరధిలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, కాపు కార్పోరేషన్ల ద్వారా మంజూరైన రూ. 67 కోట్ల రుణాలను కూడా అందజేశారు. ఆదరణ -2 పధకంలో భాగంగా రూ. 12.75 కోట్ల రూపాయిల విలువైన ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. లబ్దిదారులు ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదరికంపై గెలుపు రాష్జ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు ఆర్ధిక స్వాతంత్య కల్పించాలని ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలని జ్యోతిరావు పూలే కృషి చేసారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయన ఆలోచనల కార్యరూపం ఇస్తోందన్నారు. అన్నివర్గాల విద్యార్ధులకు విద్యనందించాలని ప్రణాళికలు చేస్తూ బడ్జెట్ విడుదల చేస్తున్నామన్నారు. ఎస్సీలకు రూ.9 వేల కోట్లు, బిసిలకు రూ. 12 వేల కోట్లు, గిరిజనులకు రూ. 4వేల కోట్లు సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు. దేశంలో పేదలకు ఇంత బడ్జెట్ కేటాయించే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రుణ సహకారాన్ని సక్రమంగా వినియోగించుకుని లబ్దిదారులు ఆర్ధికంగా ఎదగాలన్నారు. ప్రతీ కుటుంబం రూ .10వేలు ఆదాయం పొందాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ లెక్కల ప్రకారం 9శాతం పేదరికం ఉందని, అది అధిగమించేందుకు ఇటువంటి పధకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎవరకి ఇబ్బంది ఉండకూడదనే ప్రభుత్వం ఈ పధకాలను అమలు చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి, పిఠాపురం ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, కలెక్టర్ కార్తికేయమిశ్రా పాల్గొన్నారు.




