ఎక్కడిక్కడ అకట్టుకుంటున్న గులాబీ జెండాలి
హైదరాబాద్,సెప్టెంబర్1(జనం సాక్షి ): తెలంగాణ గులాబీ తోటలా మారింది.. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒక రోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్‌కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్‌కు వచ్చే దారులన్నీ గులాబీమయం అయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీ ఉంది.గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కూడళ్ల వద్ద, రోడ్లపైనా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. రేపటి సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది. ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జజ్జనకరి జనారే అంటూ ట్రాక్టర్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు, బైకుల ద్వారా కొంగరకలాన్ కు ప్రజలు బాట పట్టారు. ఇక జిల్లా కేంద్రాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ కొంగరకలాన్ కు బయల్దేరారు. మహిళలైతే కొలాటాలు, బతుకమ్మలతో సందడి చేస్తూ.. పయనమయ్యారు. కొందరైతే ముందుగానే హైదరాబాద్‌కి చేరి వారి బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో మకాం వేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా సభకు తొందరగా వెళ్ళడానికి వీలైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.




