ధైర్యం ఉంటే ఢిల్లీలో బంద్ చేయండి
– వైకాపా బంద్ వెనుక దురుద్దేశం ఉంది
– రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం
– రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొనేందుకు కుట్ర
– వైకాపాపై మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం
అమరావతి, జులై24(జనంసాక్షి) : ప్రత్యేక ¬దా కోరుతూ వైకాపా నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌పై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో చేస్తున్న బంద్ వల్ల రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగుతోందని, వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా బంద్ పిలుపు వెనుక ఉద్దేశం ఉందని, రాష్ట్రంలో అశాంతి సృష్టించడమేనని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని యనమల మండిపడ్డారు. వైకాపా తన ఎంపీలతో రాజీనామా చేయించి లోక్‌సభ వేదికను కోల్పోయిందన్నారు. అవిశ్వాసంపై ఓటింగ్‌లో పాల్గొనకుండా బీజేపీకి మేలు చేసిందని మండిపడ్డారు. వైకాపానే రాష్ట్రానికి చేయాల్సిన నష్టం అంతా చేసిందని.. ఇప్పుడు బంద్ ద్వారా మరింత నష్టం చేస్తోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే వైకాపా బంద్ చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి.. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిని దెబ్బతీసేందుకే వైకాపా బంద్ పేరుతో నాటకాలు ఆడుతందన్నారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి బంద్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి పారిపోయి ఇక్కడ బంద్‌లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం ఢిల్లీలో చేయాలి గాని రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పట్టడం ఏమిటని మంత్రి నిలదీశారు.