Friday, 6 November 2026

నందమూరి సుహాసిని…  నామినేషన్‌ దాఖలు

– కూటమి తరుపున కూకట్‌పల్లి నుంచి బరిలోకి
– సుహాసిన వెంట వచ్చిన బాలకృష్ణ, పెద్దిరెడ్డిలు
– ఎన్టీఆర్‌, హరికృష్ణలకు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
– సుహాసినికి అఖండ విజయాన్ని అందించాలి
– కూకట్‌పల్లి ఓటర్లకు విజ్ఞప్తి చేసిన బాలకృష్ణ
– త్వరలో ప్రచారంలో పాల్గొంటానని వెల్లడి
హైదరాబాద్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కూకట్‌పల్లి అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్‌ దాఖలు చేశారు. శనివారం కూకట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సుహాసిని తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
సుహాసినికి అఖండ విజయాన్ని అందించాలి – బాలకృష్ణ
సుహాసిని నామినేషన్‌ కార్యక్రమానికి ముందు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని, బాలకృష్ణలు శనివారం ఉదయం నివాళులర్పించారు. అనంతరం సుహాసిని విూడియాతో మాట్లాడారు. మా తాతా, నాన్న, మావయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానని.. తనకు తెలుగు మహిళల మద్దతు కావాలని కోరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెదేపా ఆవిర్భావం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రైతులు, మహిళలకు ఎన్టీఆర్‌ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ‘మా ఆడపడుచు నందమూరి సుహాసిని రాజకీయాల్లోకి వస్తోందని, మాఆశయాలను ఆమె ముందుకు తీసుకెళ్తారన్నారు. తెదేపాపై చూపిస్తున్న అభిమానాన్నే సుహాసినిపై కూడా చూపాలని కోరుతున్నానని తెలిపారు. యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసి రావాలని, సుహాసినికి అఖండ విజయాన్ని అందించాలని బాలకృష్ణ కూకట్‌పల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే నందమూరి హరికృష్ణకు మనం ఇచ్చే నివాళి’ అని బాలకృష్ణ అన్నారు. అనంతరం టీడీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. లక్ష మెజార్టీతో నందమూరి సుహాసినిని గెలిపించాలని కూకట్‌పల్లి ప్రజలను కోరారు. సుహాసిని విజయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు. అనంతరం మహాప్రస్థానంలోని హరికృష్ణ సమాధి వద్ద సుహాసిని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు, తెదేపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మా సోదరిని ఆదరించండి – జూ.ఎన్టీ, కల్యాణ్‌రామ్‌ల ట్వీట్‌
కూకట్‌పల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు.  ఈమేరకు తమ సోదరిని ఆదరించాలంటూ ట్వీట్‌ చేశారు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని, తెదేపా మాకు ఎంతో పవిత్రమైనదన్నారు. మానాన్న హరికృష్ణ తెదేపాకు ఎనలేని సేవలందించారని, మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం విూకు తెలిసిందేనన్నారు. సమాజంలో స్త్రీలు
ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాదని, అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్‌. జోహార్‌ హరికృష్ణ అంటూ కల్యాణ్‌రామ్‌, జూ.ఎన్టీఆర్‌లు ట్వీట్‌లో పేర్కొన్నారు..