– జనగాం నుంచి పొన్నాలకు లైన్ క్లియర్
– సనత్‌నగర్‌లో శశిధర్‌రెడ్డికి మొండిచేయి
– టీడీపీ అభ్యర్ధిగా కూన వెంకటేశ్ గౌడ్ బరిలోకి
– మరో ఆరు స్థానాలను పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం
హైదరాబాద్, నవంబర్17(జనంసాక్షి) : 13మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం శనివారం ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్యకు ఆయన ఆశించిన జనగామ నుంచి టికెట్ దక్కగా, మరో సీనియర్ నేత మర్రి శిశధర్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపింది. శశిధర్ ఆశిస్తున్న సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. ఆయన జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య సహా 13 మందితో కాంగ్రెస్ తాజా జాబితాను విడుదల చేసింది.
అభ్యర్థుల వివరాలు..
భోథ్(ఎస్టీ)- సోయం బాపురావు, నిజామాబాద్ అర్బన్-తాహెర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ రూరల్ – డా. రేకుల భూపతి రెడ్డి, బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్, ఎల్బీనగర్ -డి. సుధీర్‌రెడ్డి, కార్వాన్-ఉస్మాన్ బిన్, మహ్మద్ అల్ హజారి, యాకత్‌పురా- కె. రాజేందర్ రాజు, బహదూర్‌పుర – కలేం బాబా, కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్, తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్, జనగామ – పొన్నాల లక్ష్మయ్య, ఇల్లందు(ఎస్టీ)- బానోత్ హరిప్రియ నాయక్ లను ప్రకటించింది. తాజా జాబితాతో ఇప్పటివరకూ మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగిలిన స్థానాలను ఆదివారం ఉదయం మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తోంది.
శశిధర్‌రెడ్డికి మొండిచేయి..
సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. మహాకూటమి పొత్తులో భాగంగా సనత్‌నగర్‌ను టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌గౌడ్ పేరును టీడీపీ ఖరారు చేసింది. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని
శ్రీనివాస్ యాదవ్‌తో కూన వెంకటేశ్‌గౌడ్ తలపడబోతున్నారు. మరోవైపు సనత్‌నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మర్రి శశిధర్‌రెడ్డికి ఈ సారి నిరాశే ఎదురైంది. మర్రి శశిధర్‌కు టికెట్ కేటాయించకపోవడాన్ని మూడు కారణాలు అధిష్టానం పేర్కొంటునట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వమని, వారు తప్పుకోవాలని ఇప్పటికే అధిష్టానం పేర్కొన్నట్లు సమాచారం. జానారెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మినహాయింపు ఇచ్చారు. వి. హనుమంతరావు ముందు వద్దని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యకు కూడా అదే ఫార్ములా పాటించినప్పటికీ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వలేదని తీవ్ర విమర్శలు రావడంతో చివరి నిమిషంతో తమ నిర్ణయం మార్చుకున్నారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి ఆయన వయస్సు కారణంతో పాటు, కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి అందుబాటులో లేరని టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీనికితోడు బీసీలకు తక్కువగా సీట్లు ఇచ్చి రెడ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారనే విమర్శలు వస్తుండటంతో సనత్‌నగర్‌ను వదులుకొని జనగామను కాంగ్రెస్ ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లవుతుందని అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే మిర్యాలగూడ సీటును తన కొడుకుకు కట్టబెట్టాలని సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు కేటాయింపుపై సస్సెన్స్ కొనసాగుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలంగాణ జనమితికి కేటాయిస్తారని వినిపిస్తోంది.
నాపేరు లేకపోవడం బాధాకరం.. నాకు వేరే మార్గాలు ఉన్నాయి – మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ తాజాగా 13 మందితో మూడో జాబితా విడుదల చేసింది. మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఈ మూడు జాబితాల్లో నిరాశ ఎదురైంది. దీంతో, ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, మూడో జాబితాలో కూడా తన పేరు లేకపోవడం బాధాకరమని అన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడి, త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మర్రి శశిధర్ రెడ్డి ఆశిస్తున్న సనత్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు శశిధర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్‌ఎస్ తరపున తలసాని బరిలో ఉన్నారు.
13మందితో కాంగ్రెస్.. మూడో జాబితా విడుదల




