నేడు సిటీలో ఏర్పాటుకు సన్నాహాలు
ప్లాస్టిక్‌ను వ్యతిరేకించేలా చైతన్యం: కమిషనర్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి): ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. సర్కిళ్ల పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాల భాగస్వామ్యంతో పలు స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 2022 నాటికి హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై నగరవాసులను చైతన్యం చేయాలన్నారు. 2018 జూన్ 5వ తేదీ నుండి 2019 జూన్ 5 వరకు స్వచ్ఛ సంవత్సరంగా ప్రకటించామని తెలిపారు. తమ పరిధిలోని మార్కెట్లు, దవాఖానలు, కార్యాలయాల్లో కనీసం ఐదుగురు సభ్యులతో స్వచ్ఛ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలను ప్రతి నెలకు ఒక సారి మార్చాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయినందున మెడికల్ అధికారులు ప్రోగ్రాం అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి స్వచ్ఛ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా ఉపాధ్యాయులు విద్యార్థులతో సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి నెల 30వ తేదీలోగా కాలనీ సంక్షేమ సభ్యులు స్వీయ నిర్ధారణను పంపేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆ నివేదికలను 4నపరిశీలించి, 5వ తేదీన ప్రత్యేక పురస్కారాలను అందజేయాలని సూచించారు.పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి కాలనీలో స్వచ్ఛత సమావేశాలను నిర్వహించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ స్వచ్ఛత సమావేశాలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్, ప్లాస్టిక్ నిషేధం కంపోస్టింగ్ ప్రోత్సాహం, చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయడం తదితర అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించే డిప్యూటీ కమిషనర్లను విదేశీ యాత్రలకు పంపిస్తామని కమిషనర్ ప్రకటించారు. నగరంలో ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించాలని, అయితే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణాలను చేపట్టకుండా వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించాలని సూచించారు. స్వచ్ఛ నగరం ఇండోర్‌కు ప్రతి జోన్ నుండి ఇద్దరు చొప్పున సందర్శించి అధ్యయనం చేయాలని కోరారు. ప్రతినెలా 5వ తేదీన స్వచ్ఛ దినోత్సవంగా పాటించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.




