Tuesday, 3 November 2026

నగరంలో భారీ అగ్నిప్రమాదం…

3హైదరాబాద్ : నగరంలో జరిగిన ఓ అగ్నిప్రమాదం తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంగళ్ హాట్ పీఎస్ పరిధిలోని సీతారాంబాగ్, ద్రౌపతి గార్డెన్ సమీపంలో గల ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలిని పరిశీలించారు. సిబ్బంది మంటలు అదుపులోకి వచ్చే ప్రయత్నాలను చేస్తున్నారని నగర మేయర్ పేర్కొన్నారు. సమీపంలో ఉన్న 30-40 నివాసాలను ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు.

ఆదివారం ఉదయం ఘటన..
ఆదివారం ఉదయం ఐదంతస్తుల భవనంలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులను ఐదు అంతస్తుల్లో నిల్వ చేయడంతో మంటలు బాగా వ్యాపించాయి. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. సంఘటనా స్థలిని డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. షట్టర్ లేపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు ఒక్కసారిగా మొదటి, రెండో అంతస్తుకు వ్యాపించాయి. దీనితో భవనం గోడలు బీటలు వారాయి. రెండు జేసీబీలు తెప్పించి భవనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. జలమండలి అధికారులు నీటి సరఫరా చేసి మంటలను ఆర్పేందుకు సహాయం చేస్తోంది.

ఇరుకు సందు..
నివాస గృహాల మధ్య ఈ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమీపంలో ఇళ్లు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గోడౌన్ లో నలుగురు పార్టనర్స్ గా ఉన్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *