ప్రత్యేక పూజలు,రుద్రాభిషేకాలు
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): కార్తీకమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు కొనసాగాయి. ఉదయమే పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. శైవాలయాల్లో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు. శంకరమఠం, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శంకరమఠం ఆలయంలో స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.




