ఉక్కపోతలకు ఇక సెలవ్
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): తొలకరి హైదరాబాద్‌ను పులకరింప చేసింది. ఎండలు ఉక్కపోతతో ఉసూరుమంటున్న నగరవాసులను వర్షం పలకరించింది. అక్కడక్కడా కురిసిన వర్షంతో హైదరాబాద్ చల్లడబడింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన భారీ వర్షంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు తేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు యధాప్రకారంగానే జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండాకాలంలో నాలాలు క్లీన్ చేయకపోవడంతో ఈ దురవస్థ కలిగింది. దీంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో నేడు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం జరిగింది. నైరుతీ రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. బుధవారం రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి కదలికలను బట్టి చూస్తే రానున్న 3, 4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. వచ్చే అయిదు రోజుల్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదులోని వాతావరణ విభాగం తెలియ జేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.




