Thursday, 5 November 2026

నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా ఖమ్మం సభ : హరీశ్‌రావు

ఈ నెల 18న ఖమ్మం సభను నభూతో భవిష్యత్‌ అన్నట్లుగా నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో కేసీఆర్‌ కరీంనగర్‌లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్‌ఎస్‌ తొలిసభ ఖమ్మంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా నిలిచిపోతుందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారన్నారు. మలి దశ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం, వారి భాగస్వామ్యం మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తయారు చేశామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా జనసమీకరణ జరుగుతుందన్నారు. ఎక్కువగా 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్లు తెలిపిపారు. మహబూబాబాద్‌, సూర్యాపేట నుంచి కూడా అత్యధికంగా జనం వస్తున్నారన్నారు. ఖమ్మం చరిత్రలోనే పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతోందని, కేసీఆర్‌ను దీవించేందుకు సభకు తరలిరావాలని జనం ఉబలాటపడుతున్నారన్నారు.

ఢిల్లీ, పంజాబ్‌ సీఎంల ప్రోటోకాల్‌ను మంత్రి మహమూద్‌ అలీ చూస్తారని, కేరళ సీఎంను రిసీవ్‌ చేసుకునే బాధ్యత ప్రశాంత్‌రెడ్డి, డి రాజా బాధ్యతలు పార్టీ నాయకుడు దాసోజు శ్రావణ్‌ చేస్తారన్నారు. రేపు రాత్రికి నాయకులంతా హైదరాబాద్‌కు చేరుకుంటారని, 18న సీఎంతో బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారన్నారు. సీఎంతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటారని, అనంతరం రెండు హెలీకాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరుతారన్నారు. సభలో పాల్గొనే ముందు సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్‌లో రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.