Thursday, 5 November 2026

వందే భారత్‌కు ఎందుకంత ప్రచారం?.. సామాన్యులకు అందుబాటులో లేదు: పొన్నాల

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని, కేవలం ధనికులకు ఉపయోగపడేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

పండగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నానని కానీ, మాట్లాడక తప్పడం లేదన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. వందే భారత్‌ రైలును సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. కానీ, ఇది మొదటి రైలు కాదని, ఇప్పటి వరకు రోజు, వారాంతాల్లో నడిచేవి ఇప్పటి వరకు 17 రైళ్లు ఉన్నాయని, వందే భారత్‌ 18వది అని విమర్శించారు. ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్‌ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8ఏళ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు.