బహిరంగ చర్చకు సిద్దమేనా?
కూటమి పేరు చెబితేనే లాగులు తడుస్తున్నాయి
విూడియా సమావేశంలో మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ అధికార టిఆర్‌ఎస్‌ను నిలదీసారు. కనీసం ఒక్క పనయినా చేశారా అని అన్నారు. పాలన చేతగాక ముందే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు పారిపోయారని మండిపడ్డారు. సోమవారం గాంధీబవన్‌లో ఆయన మాట్లాడుతూ కూటమి పేరుచెబితేనే టిఆర్‌ఎస్ నేతలకు చెమటలు పడుతున్నాయని, లాగులు తడుస్తున్నాయని అన్నారు. అధికారంలో ఉండి టీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఏవిూ చేయకుండా, హవిూలు నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెట్టిన వారు కాంగ్రెస్ కూటమిపై ఎలా విమర్శలు చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల ప్రకటనపై ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ స్పందించారు. మహాకూటమికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. మిత్రపక్షాలు వారికి ఎన్ని సీట్లు కావాలో తమకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థులందరినీ ఉమ్మడిగా ఒక్కేసారి ప్రకటించాలని చూస్తున్నట్టు వెల్లడించారు. దీపావళి రోజున కానీ, ఆ తర్వాత కానీ సీట్ల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజా కూటమిలో సామాజిక ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నామని.. ఆ ప్రతిపాదికపై మిత్రపక్షాలకు సీట్లు అడగాలని చెప్పామన్నారు. ప్రజాకూటమిని చూసి టీఆర్‌ఎస్‌కు భయమేస్తుందని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. పొత్తులపై అతిగా విమర్శలు చూస్తుంటే వారు ఎంతగా ఆందోళనలో ఉన్నారో అర్తం చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా అంతే ఖాయమన్నారు.




