Tuesday, 3 November 2026

నాలుగుసీట్ల కోసం కోదండరామ్‌ పడిగాపులు

ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టిన చంద్రబాబు

కూటమి నేతలపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

సంగారెడ్డి జిల్లా నుంచి పలువురు టిఆర్‌ఎస్‌లో చేరిక

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభమే తప్ప సంక్షేమం ఉండదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన అన్ని పార్టీలు ఇప్పుడు ఒక్కటై వస్తున్నాయని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ వద్ద టీడీపీ మోకరిల్లిందని, టీడీపీ నేతలు ఢిల్లీకి గులాంగిరీ

చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం టీడీపీ, నాలుగు సీట్ల కోసం తెలంగాణ జన సమితి సిద్దాంతాలను వదులుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు పదవులే ముఖ్యమయ్యా యన్న మంత్రి.. నాడు ఉద్యమానికి దూరంగా ఉండి.. నేడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని మంత్రి హరీశ్‌ రావు ఉద్ఘాటించారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఆ పార్టీ నేతలు వీడుతున్నారు. బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు వద్ద కోదండరాం మోకరిల్లుతున్నారని నిప్పులు చెరిగారు. నాలుగు సీట్ల కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహాకూటమిలోని పార్టీలకు సిద్దాంతాలు తక్కువ.. రాద్దాంతాలు ఎక్కువ అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని ఎన్టీఆర్‌ అన్నారని…ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కోదండరామ్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌ మెట్ల దగ్గర కోదండరామ్‌ పడిగాపులుగాస్తున్నారని, సీట్ల ఖరారు కోసం ఇంకా ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ వస్తే సంక్షేమం…మహాకూటమి వస్తే సంక్షోభం నెలకొంటుందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.