నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయారా?
ఓట్లకోసం ఇప్పుడు దీక్షలతో కొత్తడ్రామాలాడుతున్నారు
చంద్రబాబు డ్రామాలను ప్రజలు తిప్పికొడతారు
ఉక్కు ఫ్యాక్టరీ సాధన మహాధర్నాలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్‌రెడ్డి
అమరావతి, జూన్23(జనం సాక్షి) : కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై మాట్లాడకుండా నాలుగేళ్ల చంద్రబాబు నింద్రపోయారని, ఇప్పుడు ఓట్ల కోసం దీక్షలు చేయిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు.
ముగిసిన మహాధర్నా..
ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.