
భారత్ ‘అణు’ పితామహుడు అబ్దుల్ కలాం ఇకలేరు
– కలాం.. నీకు ప్రపంచం తలవంచి సలాం
– మిస్సైల్ మ్యాన్‌ను దేశం మిస్సైయింది
– దేశం కోసం బ్రహ్మచర్యం
– జీవితం దేశానికే అంకితం
– రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు
– 40 యూనివర్సిటీలు డాక్టరేట్‌ల ప్రదానం
– జాతి ముద్దు బిడ్డ భారతరత్న
– కలాం మృతికి రాష్ట్రపతి, ప్రధానితోపాటు పలువురు ప్రముఖుల సంతాపం
– వారం రోజులపాటు సంతాప దినాలు
న్యూఢిల్లీ 27 జూలై (జనంసాక్షి):
ఓమహోన్నత శిఖరం నింగికి ఎగిసింది. భూ ప్రపంచాన్ని వదిలిన కలాంకు యావత్ విశ్వం తలవంచి సలాం చేసింది. చావు పుట్టుక మాత్రమే ఆయనది. జీవిత సర్వస్వం దేశానికే అంకితం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం(84) కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం బెథానీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సఅందించారు. చికిత్స పొందుతూ కలాం తుదిశ్వాస విడిచారు. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు.
పేదరికం నుంచి …
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పూర్తిపేరు ఆవుల్ పకీర్ జైన్‌లాబ్దిన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు.పేద కుటుంబం నుంచి వచ్చిన కలాం చిన్నతనంలో న్యూస్ పేపర్‌బాయ్‌గా పనిచేసి తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు. రామనాథపురంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన ఆయన తిరుచునాపల్లి సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో 1954లో ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 1955లో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో చేరారు. 1960లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఆ తర్వాత డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. అదే సమయంలో భారత సైన్యం కోసం ఓ హెలికాప్టర్‌ను తయారుచేశారు. అంతటితో సంతృప్తి చెందని కలాం 1969లో ఇస్రోలో చేరారు. మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్‌ఎల్‌వీ-3 ప్రయోగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని ఈ రీ|క భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. 1970-90 మధ్య కాలంలో పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎల్‌వీ-3 ప్రాజెక్టుల నిర్వహణలో కలాం విశేషంగా కృషి చేశారు. 1992 జులై నుంచి 1999 డిసెంబర్ మధ్య ప్రధాన మంత్రి శాస్‌ీయ సలహాదారుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొంది దేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలందించారు.
భారత క్షిపణి పితామహుడు… కలాం
ఆధునిక యుగంలో యుద్ధరంగం తీరు మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా… తదితర దేశాలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో భారతీయుల అమ్ములపొదిలో దూరశ్రేణి క్షిపణులతో పాటు పలు రకాల క్షిపణులకు రూపకల్పన చేసి రక్షణరంగంలో భారత ప్రతిభను రెపరెపలాడించిన అనితర దేశభక్తుడు అబ్దుల్‌కలాం. పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్… తదితర క్షిపణులు ఆయన కృషితో భారత అమ్ములపొదిలో సమకూరాయి. అగ్ని బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యంతో భారత్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణులను రూపొందించడం విశేషం.
కలాంకు డాక్టరేట్లు ప్రదానం చేసిన 40 విశ్వవిద్యాలయాలు
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలు ప్రకటించింది. 40 విశ్వవిద్యాలయాలు ఆయనకు ్ణొరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. కలాం 79వ జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా గుర్తిస్తున్నట్లు ఐరాస ప్రకటించింది.
11వ రాష్ట్రపతిగా సేవలు..
భారత దేశ 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు సేవలందించారు. కేఆర్ నారాయణన్ తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించారు. వామపక్షాలు బరిలోకి దించిన లక్ష్మీసెహగల్‌పై కలాం విజయం సాధించి భారత అత్యున్నత పదవిని చేపట్టారు. 2007 జులై 25 వరకు ఆ పదవిలో కొనసాగారు.
కలాం మృతికి పలువురు ప్రముఖుల సంతాపం
మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దేశం ఒక మ¬న్నత వ్యక్తిని కొల్పోయిందని అన్నారు.రాష్ట్ర్రపతి ప్రణబ్‌ముఖర్జీ , ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, దిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు ట్విట్టర్‌లో తమ సంతాప సందేశాలను పోస్టు చేశారు.
కలాం మరణం జాతికి తీరని లోటు : కేసీఆర్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కలాం మరణం జాతికి తీరని లోటని పేర్కొన్నారు. గొప్ప మానవత్వం ఉన్న మనిషి కలాం అని కొనియాడారు. దేశంలో మిసైల్ మేన్‌గా కలాం పేరుగాంచారని అన్నారు.
దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది : చంద్రబాబు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. కలాం మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు, స్ఫూర్తిదాతను కోల్పోయిందని అన్నారు.
రేపు ఉదయం కేబినెట్ సమావేశం: కేంద్రమంత్రి వెంకయ్య
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం పార్లమెంట్ కేబినెట్ సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జరిగే ఈ సమావేశంలో కలాంకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
7 రోజులు సంతాపదినాలుగా ప్రకటించిన కేంద్రం
ఆయనకు నివాళిగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
రేపు దిల్లీకి కలాం భౌతికకాయం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం బెథానీ ఆసుపత్రి నుంచి దిల్లీకి తరలించనున్నట్లు రక్షణశాఖ పీఆర్వో అమిత్ మహాజన్ తెలిపారు. ఉదయం 5.30గంటలకు వైమానిక దళ హెలికాఫ్టర్‌లో గువహటికి తరలించి అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రాంతంలో దిల్లీకి చేర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రామేశ్వరంలో జన్మించిన అబ్దుల్‌కలాం భారత అత్యున్నత అధికార పీఠమైన రాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టడం వెనక ఎంతో కృషి వుంది. రాష్ట్రపతి భవన్‌లో వున్న ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడంతో తనకిష్టమైన శాస్త్ర,సాంకేతిక రంగాల్లో అనేకమంది శాస్త్రవేత్తలకు సూచనలివ్వడం విశేషం. అబ్దుల్‌కలాం భారత 11వ రాష్ట్రపతిగా 2002 జులై 25 నుంచి 25 జులై 2007 వరకు పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 9,22,884 ఓట్లు సాధించి 1,07,366 తేడాతో లక్ష్మీ సెహగల్‌పై గెలిచారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి, అప్పటి కేబినెట్ మంత్రులతో కలిసి కలాం నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ తర్వాత భారతరత్న పురస్కారం పొందిన మూడో రాష్ట్రపతి కలాం.భారత రాష్ట్రపతిగా పనిచేసిన తొలి శాస్త్రవేత్త, అవివాహితుడు కూడా కలామే.ప్రజలకు అత్యంత ఇష్టమైన రాష్ట్రపతిగా కలాం పేరు సంపాదించారు.
కలాం రాష్ట్రపతిగా ఉండగా 21 క్షమాభిక్ష విన్నపాలు వచ్చాయి. అందులో ముఖ్యమైంది అఫ్జల్‌గురూది. అయితే వీటిలో ఒక పిటిషన్ మాత్రమే ఆయన చూశారు. 2003, 2005లో ఎంటీవీ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
రాష్ట్రపతి పదవి తర్వాత..
రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత కలాం ఆచార్యుడిగా పనిచేశారు. దేశంలోని ప్రఖ్యాత షిల్లాంగ్, అహ్మదాబాద్, ఇండోర్ ఐఐఎంలలో, బెంగళూరులోని ఐఐఎస్, స్పేస్ ఇన్‌స్టిట్యూట్‌ల, అన్నా యూనివర్సిటీ, జేఎస్‌ఎస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఐటీ హైద్రాబాద్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సాంకేతికతక సంబంధించిన అంశాలు బోధించారు.
కలాం జీవితంపై ‘ఐయామ్ కలాం’ అనే హిందీ సినిమా వచ్చింది.
ఆయన తన జీవితకథను ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’గా వెలువరించారు.
– ఈ పుస్తకం మొదట ఇంగ్లీష్ళలో ముద్రించారు.
– అనంతరం 13 భాషల్లోకి అనువదించారు.
– హిందీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం, ఒరియా, మరాఠీ… తదితర భాషలతో పాటు బ్రెయిలీ లిపిలోకి ముద్రణకావడం విశేషం.
– చెయనా భాషలోనూ ఈ పుస్తకాన్ని అనువదించారు.
– ఇంగ్లీష్‌లో ఈ పుస్తకాన్ని లక్ష కాపీలకు పైగా విక్రయించారు.
ఈయన తల్లిదండ్రులు అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్. ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958లో మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. ”ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు.




